బాబు రివర్స్ వ్యూహం..సొంత ఎంపీపై దుష్ప్రచారం?

Update: 2017-04-15 09:57 GMT
చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ రీసెంటుగా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు చేసిందేమీ లేదని శివప్రసాద్‌ కుండబద్ధలు కొట్టడంతో అంతా ఇరుకున పడ్డారు.  అయితే.. దీన్ని టీడీపీ నుంచి ఎవరూ గట్టిగా ఖండించలేకపోతున్నారు. అలా ఖండిస్తే.. ఏమేం చేశారో చెప్పాల్సి ఉంటుంది, కానీ.. నిజంగానే చేసిందేమీ లేకపోవడంతో ఏం చేశారో చెప్పలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది.
    
కాగా మంత్రివర్గ విస్తరణ అనంతరం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి ఇవాళ పార్టీ సీనియర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా శివప్రసాద్ ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తోంది.  ఈ సందర్భంగా చంద్రబాబు... దళితులకు ఏం చేశామో చెప్పాలంటూ సీనియర్‌ నేతలకు సూచనలు ఇచ్చారట. అయితే.. సీనియర్లు కొందరు  శివప్రసాద్‌ చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏమీ లేవని సీఎంతోనే అన్నట్లు సమాచారం.  అయితే... వ్యక్తిగత ఎజెండాతో శివప్రసాద్‌ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ప్రచారం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
    
శివప్రసాద్ వ్యవహారంపై చంద్రబాబు.. మంత్రి అమ‌ర్‌ నాథ్‌ రెడ్డితో మాట్లాడి ఆ తరువాత కొన్ని విషయాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. హ‌థీరాంజీ మ‌ఠం భూములు ఇవ్వాలని  ఎంపీ శివప్రసాద్ సిఫార‌సు లేఖ ఇచ్చారని...  ఆ భూముల కేటాయింపు నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని తిర‌స్క‌రించామని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.  దాంతో శివప్రసాద్ ఇలాటి వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు ఆ సమావేశంలో చెప్పినట్లుగా తెలుస్తోంది.  దీంతో శివ‌ప్రసాద్ వ్య‌క్తిగ‌త అజెండాతోనే ఇటువంటి వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు మంత్రులు ప్రచారం మొదలుపెడుతున్నారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వ అసమర్థతను ఇలాంటి ఆరోపణలతో కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News