బాబు వాయిదా వేశారు!

Update: 2016-04-07 09:59 GMT
గ‌త నాల్రోజులుగా వార్త‌ల్లో హైలెట్ అవుతున్న అంశం  ఒక‌టే ఒక‌టి. అది ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఏపీ సీఎం చంద్ర‌బాబు నోటి నుంచి మైనార్టీని మంత్రిగా చేస్తామ‌న్న మాట వెలువ‌డ‌టం ఆల‌స్యం ఈ అంచ‌నాలు, చ‌ర్చోప‌చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. మంత్రివర్గ విస్తణ ఉగాది తరువాత ఉంటుందన్న‌ వార్త‌లు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నారు. అయితే ఇది జూన్ - జూలై వరకూ వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ నేతలు అంటున్నారు. ఇందుకు ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణాలు చెప్తున్నారు.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణను ఉగాది రోజున చేయ‌కుండా ఏపీ సీఎం చంద్ర‌బాబు వెన‌క‌డుగు వేయ‌డం వెనుక ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు. అందులో మొద‌టిది వివిధ ప‌త్రిక‌ల్లో మంత్రుల అవినీతి గురించి వ‌రుస క‌థ‌నాలు రావ‌డం. ఉగాదికి క‌నుక మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్టి అందులో ఈ క‌ళంకిత ఆరోప‌ణ‌లున్న మంత్రుల‌ను తొల‌గిస్తే స‌ద‌రు వార్త‌ల‌కు చంద్ర‌బాబు త‌లొగ్గిన‌ట్లు అవుతుంద‌ని చెప్తున్నారు. పైగా అలాంటివారితో రెండేళ్లు బండి నెట్టుకొచ్చార‌నే అప‌ప్ర‌ద కూడా మూట‌గ‌ట్టుకుంటారని పార్టీ నేత‌లు వివ‌రిస్తున్నారు.

ఇంతేకాకుండా ప్ర‌స్తుతం తాత్కాలిక స‌చివాల‌యం నిర్మాణం - ఉద్యోగుల త‌ర‌లింపు వంటి అంశాల‌పై దృష్టి సారించాల్సిన స‌మ‌యంలో మంత్రివ‌ర్గ మార్పు చేర్పులు స‌రైన నిర్ణ‌యం కాద‌ని పార్టీకి చెందిన కొంద‌రు సీనియ‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అదే ప‌రిపాల‌న‌ను పూర్తిస్థాయిలో త‌ర‌లించిన త‌ర్వాత ఏ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌ద‌ని విశ్లేషిస్తున్నారు. టీడీపీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత సమాచారం ప్ర‌కారం ఉగాది త‌ర్వాత వారం రోజుల వ‌ర‌కు మంత్రివ‌ర్గ మార్పు అయితే ఉండే అవ‌కాశం లేద‌ట‌.
Tags:    

Similar News