తెలంగాణ తెలుగుదేశం పార్టీలోని పరిణామాలు ఎంత వేగంగా...అనూహ్యంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చేరువ అయిపోవడం....దాన్ని ఆయన ఖండించడం...తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ను దాదాపుగా వెలి వేసినట్లు వ్యవహరించడం...ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ పరువును గంగపాలు చేయడం...తెలిసిన సంగతే. ఇంత హాట్ హాట్ రచ్చ జరుగుతున్న సమయంలో...తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విదేశీ టూర్ లో ఉన్నారు. ఆయన స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే దీనిపై స్పందించారు.
హైదరాబాద్ లో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్చ ఎలాంటి ఫలితం ఇవ్వకుండానే ముగిసిపోయింది. అనంతరం ఏపీలో సమావేశాల కోసం సీఎం చంద్రబాబు అమరావతి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు చిట్ చాట్ చేశారు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ పై కూడా స్పందించారు. అసెంబ్లీ మినహా రాజధాని భవనాల డిజైన్లు ఖరారైనట్లేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. సంక్రాంతికి అటు ఇటుగా రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. రాజమౌళి విలువైన సూచనలు చేశారన్నారు. డిజైన్ల ఖరారులో రాజమౌళి కీలకంగా వ్యవహరించారన్నారు. మరో 40రోజుల్లో అసెంబ్లీ డిజైన్లు ఖరారు చేస్తామన్నారు.
తెలంగాణ టీడీపీలో వ్యవహారాలన్నీ సర్దుకుంటాయని బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ గౌరవం కాపాడేలా నాయకులు వ్యవహరించాలని కోరారు. పాదయాత్ర మధ్యలో జగన్ కోర్టుకు హాజరవుతూ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. పోలవరం నిర్మాణానికి నిధులతో ఇబ్బంది ఉందని, త్వరలోనే అడ్డంకులు తొలగిపోతాయన్నారు. విదేశీ పర్యటన విజయవంతమైందన్నారు. తెలంగాణ తెలుగుదేశంలో వ్యవహారాలన్నీ సర్దుకుంటాయన్నారు.