సీఎంవోకి వెళితేనే ప‌ని అవుతుందా బాబు?

Update: 2019-05-02 08:21 GMT
ప‌రిస్థితులు అనుకూలంగా లేన‌ప్పుడు ఆచితూచి అడుగులు వేసినంత మాత్రాన కొంప‌లు మునిగిపోవు. కొన్ని విష‌యాలు స‌రిగా జ‌ర‌గ‌టం లేద‌ని తెలిసినా.. అదే ప‌నిగా అలాంటి వాటిని ప్ర‌స్తావించినంత‌నే.. ఆ ప‌నుల‌న్ని జ‌రిగిపోవ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. నిజంగానే వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాలంటే.. చేతిలో అధికారంలో ఉన్న‌ప్పుడు లోపాల్ని స‌రిదిద్దే ప‌నిని సీరియస్ గా చేప‌ట్టాలి.

ఈసీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం.. బాబుకు ఇబ్బంది ఎదుర‌య్యేలా ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ‌.. త‌న స్థాయిని త‌గ్గించుకోకుండా హుందాగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. త‌న చేతులు క‌ట్టేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ అదే ప‌నిగా చెప్పుకునే బ‌దులు.. మౌనంగా ఉండ‌టం ద్వారా కూడా ప్ర‌జ‌ల‌కు పంపాల్సిన సంకేతాల్ని పంపొచ్చు.

అలాంటివేమీ చేయ‌ని చంద్ర‌బాబు.. అవ‌స‌రానికి మించిన రీతిలో ప్ర‌తి విష‌యానికి స్పందిస్తున్నారు. ఈసీ తీరు ఎలా అయితే అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌న్న మాట వినిపిస్తోందో.. అదే రీతిలో ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరు కూడా ఉంద‌న్న విష‌యాన్ని కొట్టిపారేయ‌లేం. ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో మూడు వారాల్లో రానున్న వేళ‌.. ఇంకా పూర్తిస్థాయి సీఎంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఊవ్విళ్లూర‌టం స‌రైన ప‌ద్ధ‌తి కాదు.

తాజా ఉదంతాన్నే చూస్తే.. ఉత్త‌రాంధ్ర మీద ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌న్న అంచ‌నా ఉన్న ఫ‌ణి తుపాను నేప‌థ్యంలో ఈ రోజు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వెళ్లాల‌ని డిసైడ్ అయ్యారు చంద్ర‌బాబు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ‌.. కొన్ని వ్య‌వ‌స్థ‌లు త‌న‌కు ప్ర‌తికూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌న్న  భావ‌న‌లో ఉన్న బాబు.. సీఎంవోకి వెళ్ల‌టం వ‌ల్ల జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏమిటి? అన్న‌ది ఒక‌ప్ర‌శ్న‌.

ఉద‌యం నుంచి సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కూ సీఎంవోలోనే ఉండి.. తుపాను ప‌రిస్థితిని సమీక్షిస్తార‌ని చెబుతున్నారు. ఆలోచ‌న బాగానే ఉంది. కానీ.. వ్య‌వ‌స్థ‌లోని వారు త‌న మాట‌ను విన‌కుంటే ఆవేశంతో అదే ప‌నిగా త‌న  ఆక్రోశాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం త‌ప్పించి మ‌రింకేమీ చేయ‌లేని ప‌రిస్థితి ఉంటుంది. అదే జ‌రిగితే.. తుపాను కార‌ణంగా జ‌ర‌గాల్సిన ప‌నుల కంటే హైడ్రామానే ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌కృతి వైప‌రీత్యం వేళ‌.. ప‌నుల‌న్ని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో జ‌రుగుతున్నాయా?  లేదా? అన్న విష‌యాన్ని చూస్తే స‌రిపోతుంది త‌ప్పించి.. సీఎంవోలో గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌ప‌టంతో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని బాబు ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు?


Tags:    

Similar News