కేఈకి 24 గంట‌ల్లోనే షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు

Update: 2015-09-16 16:34 GMT
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఉన్న విబేధాలు మ‌రోసారి భ‌గ్గుమ‌న్నాయి. ఇప్ప‌టికే వీరిద్ద‌రు ఉప్పునిప్పుగా ఉంటున్నారు. కేఈకి చంద్ర‌బాబు అస్స‌లు ప్ర‌యారిటీ ఇవ్వ‌ట్లేదు. ఇక కేఈ కూడా ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిరంగ వేదిక‌ల మీదే  చంద్ర‌బాబుపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సాక్షాత్తు రెవెన్యూ మంత్రిగా కేఈ ఉన్నా ఆయ‌న్ను ప‌క్కన పెట్టిన చంద్ర‌బాబు రాజ‌ధాని భూసేక‌ర‌ణ విష‌యంలో మాత్రం నారాయ‌ణ‌, ప్ర‌త్తిపాటి పుల్ల‌రావు వంటి వారికి ప్రాధాన్యం ఇచ్చారు. క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో కూడా కేఈ కంటే జ‌య‌నాగేశ్వ‌ర్‌రెడ్డి లాంటి జూనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా మంగ‌ళ‌వారం రెవెన్యూ శాఖ‌లో 22 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ..వారిలో కొంద‌రికి ప్ర‌మోష‌న్లు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్లు 872, 873, 874, 876 జారీ చేసింది. ఉప ముఖ్య‌మంత్రి అనుమ‌తితోనే ఈ బ‌దిలీలు, ప‌దోన్న‌తుల జీవోలు జారీ అయ్యాయి. అయితే ఈ జీవోలు జారీ అయ్యి 24 గంట‌లు గ‌డ‌వ‌క ముందే వీట‌న్నింటిని అబెయెన్స్‌ లో పెడుతున్న‌ట్టు ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా 888 జీవో జారీ చేసి కేఈకి పెద్ద షాక్ ఇచ్చింది.

 తాజాగా జారీ అయిన జీవో వెన‌క టీడీపీ యువ‌నేత లోకేష్ హ‌స్తం ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోసారి కేఈకి త‌న రెవెన్యూ శాఖ‌లో ఏ మాత్రం ప‌ట్టులేకుండా చేస్తున్నార‌న్న విష‌యం బ‌హిర్గ‌త‌మైంది. త‌న శాఖ‌లో తాను తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం జీవో జారీ చేయ‌డంతో కేఈ అసంతృప్తితో ర‌గిలిపోతున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఏ నిమిషంలో ఏ నిర్ణ‌య‌మైనా తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కొద్ది రోజులుగా చంద్ర‌బాబు వ‌ర్సెస్ కేఈ మ‌ధ్య జ‌రుగుతున్న ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం తాజా సంఘ‌ట‌న‌తో ప‌తాక స్థాయికి చేరుకుంది. ఇది ఇప్ప‌ట్లో స‌మ‌సేలా క‌నిపించడం లేదు.
Tags:    

Similar News