సింగ‌పూర్ లో బాబు అద‌ర‌గొట్టారు

Update: 2015-09-21 12:41 GMT
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామిక వేత్తలకు ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు అక్క‌డ పారిశ్రామిక‌వేత్త‌ల‌ను క‌లుసుకోవ‌డంతో పాటు వివిధ స‌మావేశాల్లోనూ ప్ర‌సంగిస్తున్నారు. తాజాగా 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్' లో నిర్వహించిన సెమినార్ లో చంద్రబాబు మాట్లాడారు. సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు ఎపి సొంతమని చెప్పారు. కార్గో విభాగంలో నెంబర్ వన్ కావడమే తమ లక్ష్యమన్నారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ర్ట విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌తో పాటు అవ‌కాశాల‌ను సైతం క‌ల్పించింద‌న్నారు. ఏపీలో ఇనుము - బాక్సైట్ వంటి అనేక నిక్షేపాలు ఉన్నాయ‌ని తెలిపారు. గోదావ‌రి - కృష్ణా న‌దుల అనుసంధానికి కృషిచేస్తున్నామ‌ని తెలిపారు.

వ‌ర‌ల్డ్ బ్యాంకు రూపొందించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టులోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు రెండో స్థానం ద‌క్కింద‌ని బాబు తెలిపారు. ప్ర‌పంచ స్థాయి గుర్తింపుగ‌ల ఆ ర్యాంకింగ్ త‌మ రాష్ర్ట ప‌నితీరుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. సింగిల్‌ విండో విధానంలో తాము వ్యాపార‌వేత్త‌ల‌కు అనుమ‌తులు ఇస్తున్నామ‌ని....త‌ద్వారా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు ప్ర‌క్రియ సుల‌భ‌మైంద‌ని తెలిపారు. పారిశ్రామిక కారిడార్‌ తో ఏపీలోని వివిధ ప్రాంతాల‌ను అనుసంధానం చేశామ‌ని పేర్కొంటూ పుష్క‌ల‌మైన మాన‌వ‌వ‌న‌రులు ఏపీ సొంతమ‌ని వివ‌రించారు. ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని నిర్మాణంతో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు బాబు వివ‌రించారు. ఏడాదికాలంగా భార‌త శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం సైతం దేశ అభివృద్ధికి విశేష ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తోంద‌ని బాబు తెలిపారు.
Tags:    

Similar News