బీజేపీతో బాబు డ‌బుల్ గేమ్ చూశారా?

Update: 2017-08-28 07:18 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నిక‌ల వేళ ర‌చించి అమ‌లు చేస్తున్న వ్యూహాలు నిజంగానే ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు... ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తి సారీ ఓ కొత్త ప్ర‌ణాళిక ర‌చించుకుని ముందుకు సాగుతార‌న్న వాద‌న లేక‌పోలేదు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రానికి తొమ్మిదిన్న‌రేళ్ల పాటు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బాబు అమ‌లు చేసిన వ్యూహంపై నాడు పెద్ద  చ‌ర్చే జ‌రిగింది. ఎంఐఎంను మ‌ట్టి క‌రిపించేందుకు ప‌క్కా వ్యూహం ర‌చించిన బాబు... ముస్లిం ఓట్లు పోల్ కాకుండా ఉండేందుకే ప‌థ‌క ర‌చ‌న చేసి అందులో స‌క్సెస్ అయ్యార‌నే చెప్పాలి. ఎవ‌రైనా ఓటు వేయాలంటూ డ‌బ్బిస్తే... ఓటు వేయ‌కుండా ఉంటే కూడా డ‌బ్బు ఇచ్చే సంస్కృతికి బాబే శ్రీ‌కారం చుట్టార‌న్న వార్త‌లు నాడు పెద్ద క‌ల‌క‌ల‌మే రేపాయి.

అయితే అదంతా గ‌త‌మైతే.. ఇప్పుడు క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక‌ - రేపు జ‌ర‌గ‌నున్న కాకినాడ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో చంద్రబాబు వ్య‌వ‌హ‌రించిన తీరు,  అమ‌లు చేస్తున్న కొత్త వ్యూహం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లిన చంద్ర‌బాబు... ఆ ఎన్నిక‌ల్లో బాగానే ల‌బ్ధి పొందారు. జ‌నం ఇచ్చిన తీర్పుతో అటు కేంద్రంలో బీజేపీ - ఇటు ఏపీలో టీడీపీ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాయి. ఈ క్ర‌మంలో రెండు పార్టీలు మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించాయ‌నే చెప్పాలి. ఇందులో భాగంగానే... కేంద్రంలో టీడీపీకి మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌గా... రాష్ట్రంలో టీడీపీ స‌ర్కారులో బీజేపీ ఎమ్మెల్యేల‌కు కూడా మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి. అంటే... నాటి నుంచి కూడా మిత్ర‌ప‌క్షాలుగానే కొన‌సాగుతూ వ‌స్తున్న ఈ రెండు పార్టీలు ఎక్క‌డ ఎన్నిక‌లు వ‌చ్చినా కూడా క‌లిసే పోటీ చేస్తాయ‌ని అంతా భావించారు.

అయితే గెలుపే ల‌క్ష్యంగా ప‌థ‌క ర‌చ‌న‌ను చేసిన చంద్ర‌బాబు... త‌మ పార్టీ అభ్య‌ర్థుల కోసం బీజేపీతో డ‌బుల్ గేమ్‌ కు తెర తీశార‌నే చెప్పాలి. అయినా మిత్ర‌ప‌క్షంతో చంద్ర‌బాబు డ‌బుల్ గేమ్ ఆడ‌తారా? అన్న ప్ర‌శ్నే వేసుకుంటే... ముమ్మాటికీ ఆడార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇందుకు నిద‌ర్శ‌నంగా వారు చెబుతున్న విష‌యాల్లోకి వెళితే... ఇప్ప‌టికే ఎన్నిక ముగిసిన నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని అస‌లు రంగంలోకే దించ‌లేదు. తాము ప్ర‌చారానికి వ‌స్తామ‌ని బీజేపీ నేత‌లు చెప్పినా... పార్టీ కండువా - జెండాలు లేకుండా వ‌స్తేనే అనుమ‌తిస్తామంటూ బాబు ఆ పార్టీ నేత‌ల‌కు చెప్పార‌ట‌. దీంతో షాక్ తిన్న బీజేపీ అస‌లు నంద్యాల ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడుగే పెట్టలేదు.

ఈ వ్యూహాన్ని చంద్ర‌బాబు ఎందుకు అవ‌లంబించార‌న్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే... నంద్యాల ఉప ఎన్నిక‌లో ముస్లిం ఓట్లే కీల‌కం. ఇదే విష‌యాన్ని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ముస్లింల ఓట్ల‌ను గంప‌గుత్త‌గా కొల్ల‌గొట్టేందుకే బీజేపీని దూరం పెట్టార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఒక‌వేళ బీజేపీ నేత‌లు టీడీపీ అభ్య‌ర్థికి అనుకూలంగా ప్ర‌చారం చేసి ఉంటే... హిందూత్వ వాదంతో ముందుకు వెళుతున్న బీజేపీ జెండాలు చూసి ఉంటే... కొంత‌మంది ముస్లింలైనా టీడీపీకి వ్య‌తిరేకంగా  ఓటేసేవారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించినందునే చంద్ర‌బాబు నంద్యాల‌లో బీజేపీని దూరం పెట్టేశారు.

ఇక రేపు జ‌ర‌గ‌నున్న కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఏకంగా బీజేపీ నేత‌ల‌కు సీట్లు ఇచ్చేశారు. బీజేపీ నేత‌లు నిల‌బ‌డ్డ స్థానాల్లో నామినేష‌న్లు వేసిన టీడీపీ నేత‌ల‌ను ఏకంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. అంటే... అక్క‌డ ముస్లిం ఓట‌ర్లు పెద్ద‌గా లేర‌ని,  బీజేపీకి కాస్తంత ఓటు బ్యాంకు ఉంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన త‌ర్వాతే చంద్ర‌బాబు అక్క‌డ బీజేపీకి ప్రాధాన్య‌మిచ్చార‌న్న మాట‌. చంద్ర‌బాబు ఆడుతున్న ఈ డ‌బుల్ గేమ్ ను బీజేపీ గ్ర‌హించినా.... ఏమీ అన‌లేని ప‌రిస్థితి. ఎందుకంటే... ఏపీలో ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు అంతంత మాత్రమే కాబ‌ట్టి. చంద్ర‌బాబు డ‌బుల్ గేమ్ ఆడుతున్నార‌ని చెప్పుకున్నా... ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకెళ్లే రాజ‌కీయ నేత‌గా ఆయ‌న వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త‌గా రూపొందుతుండ‌టం మాత్రం ఆస‌క్తి రేకెత్తించేదే.
Tags:    

Similar News