బాబు ఆచితూచి అడుగులు అందుకేనా?

Update: 2015-10-26 11:27 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమం వేదికగా ప్రధాని మోడీ రాష్ట్రానికి వరాలు కురిపిస్తారని అంతా ఆశించినా అది నిరాశగానే మిగిలింది. అయితే... ప్రధాని ఇవ్వలేదన్న విషయం మరుగుపడి బాబు గట్టిగా అడగలేదన్న విమర్శలే అధికమవుతున్నాయి. కాంగ్రెస్ - వైసీపీలు ఈ విషయంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డాయి కూడా. అంతేకాదు బాబు ప్యాకేజీయే అడిగారు కానీ హోదా మాటెత్తలేదంటున్నారు.

అయితే... రాజకీయ పండితులు మాత్రం చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఒత్తిడి చేయలేదని అంటున్నారు. అందుకు ప్రధానంగా అయిదు కారణాలు చెబుతున్నారు.

- వేదికపై చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరుతూ మోడీవైపు చూశారు. అయితే.. చంద్రబాబు ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ అడగడంపై విమర్శలొచ్చాయి. కానీ, చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెబుతూ పార్లమెంటులో ఆ మేరకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై కేవలం నోటిమాటే తప్ప విభజన చట్టంలో లేకపోవడం వల్లే చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్యాకేజీని ప్రస్తావించారు.

- ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రానికి ప్రధాని రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తానని ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రత్యేకంగా ఏపీకి ప్యాకేజీ విషయం గుర్తుచేశారు.

- కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వివిధ కేంద్ర విద్యాసంస్థలు, పలు ఇతర ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి వాటన్నిటికీ కేంద్రం నిధులు ఇవ్వనుంది. అంతేకాదు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికీ నిధులు ఇవ్వనుంది. రాజధాని నిర్మాణానికి, పోలవరానికీ నిధులు ఇస్తామని మాటిచ్చింది. ఆ నేపథ్యంలో అన్ని అవసరాలు ఉంచుకుని ప్రత్యేక హోదా కోసం శంకుస్థాపన వంటి శుభ తరుణంలో కేంద్రం వద్ద చెడ్డకారాదన్న ఉద్దేశంతోనూ చంద్రబాబు హోదా మాటెత్తలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- ఏపీలో పలు విదేశీ సంస్థలతోనూ ఒప్పందాలు చేసుకుంటూ పారిశ్రామికాభివృద్ధికి ప్రయత్నిస్తున్నారు. వీటికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది రాకుండా చంద్రబాబు కేంద్రంతో మంచిగా ఉంటున్నారు.

- మరోవైపు కేంద్రంలోని బీజేపీతో టీడీపీకి ఏ కారణంగానైనా పొరపాచ్చాలు వచ్చి రెండూ స్నేహం వీడితే వెంటనే వైసీపీ, టీఆరెస్ లు ఎన్డీయేలో చేరుతాయి. అప్పుడు ఏపీకి మరిన్ని కష్టాలు చుట్టుముడతాయి.

.. ఇవన్నీ తెలిసే తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులేస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Tags:    

Similar News