తిరుపతిలో బాబు ‘‘ఆకస్మిక తనిఖీ’’ హడావుడి

Update: 2016-10-14 07:59 GMT
తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో చంద్రబాబు ఒక విషయంలో చాలా ఫేమస్. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళతారో? ఎక్కడ ఆకస్మిక తనిఖీలు చేపడతారో తెలీక అధికారులు కిందామీదా పడే వారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండేవారు. అలా తన మార్క్ ఆకస్మిక తనిఖీల్ని పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేపట్టలేదు. ఆకస్మిక తనిఖీల కారణంగా అధికార వర్గాల్లో తనపై అసంతృప్తి పెరిగిపోతుందన్న ఉద్దేశంతోనే చంద్రబాబు వదిలిపెట్టారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

ఈ మాటకు తగ్గట్లే గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో చంద్రబాబు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు చాలా తక్కువే. ఆయనతో పోలిస్తే.. ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రి కామినేని నిర్వహించిన ఆకస్మిక తనిఖీలే ఎక్కువని చెప్పాలి. మరి.. పాత అలవాట్లు గుర్తుకు వచ్చాయేమో కానీ.. ప్రస్తుతం తిరుపతిలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఉన్నట్లుండి ఆకస్మిక తనిఖీలు మొదలెట్టారు.

తిరుపతి నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఆయన తనిఖీలు చేపట్టి.. అక్కడి స్థానికుల నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యల్ని చెబుతున్న ప్రజలను ఉద్దేశించి.. ఏం కావాలంటూ బాబు అడిగిన తీరు చూసినప్పుడు.. ఆయన మాటలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. స్కావెంజర్స్ కాలనీలో ఉన్న పరిస్థితుల్ని గమనించిన చంద్రబాబు.. మురికివాడల్ని తొలగించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెప్పారు.

స్థలాలు ఉన్న వారికి బహుళ అంతస్తుల భవనాల్లో శాశ్వత ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ఆయన.. ఈ సందర్భంగా అక్కడి వారంతా కూర్చొని..ఏకాభిప్రాయానికి రావాలని.. ఆ మాటను తనకు చెబితే తాను పనులు చేయిస్తానని చెప్పటం కనిపించింది. కాలనీలో తాగునీరు సరిగా రాకపోవటం..పారిశుద్ధ్యం ఏ మాత్రం బాగోలేకపోవటాన్ని గుర్తించి చంద్రబాబు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్కావెంజర్స్ కాలనీ నుంచి జీవకోన వైపు వెళుతూ.. తుడా కార్యాలయం రోడ్డులోని మురికి కాలువను పరిశీలించిన చంద్రబాబు.. చెత్తతో కాలువ నిండిపోవటాన్ని చూసి అధికారులపై ఫైర్ అయ్యారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలతో అధికారులు ఒక్కసారిగా అలెర్ట్ కావటమే కాదు.. హడావుడిగా పరుగులు తీయటం కనిపించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News