అచ్చెన్న చంద్రన్నకు ఎందుకు టార్గెట్ అయ్యారు?

Update: 2017-02-15 10:06 GMT
చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఎంతో జూనియర్ అయిన కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మిగతా సీనియర్ మంత్రుల కంటే ఎక్కువగా చంద్రబాబు వద్ద మంచి పేరు సంపాదించుకున్నారు. తన శాఖపై పట్టు విషయంలో కానీ.. విపక్షాలను ఎండగట్టడంలో కానీ ఆయన చంద్రబాబు వద్ద ఫుల్ మార్కులు కొట్టేశారు. అందుకే పలుమార్లు ఆయన మంత్రివర్గంలో టాప్ లో ఉండి చంద్రబాబు నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే.. గత ఆర్నెల్లుగా ఏమవుతుందో ఏమో కానీ ప్రతి మంత్రివర్గ సమావేశంలోనూ చంద్రబాబు అచ్చెన్నకు చీవాట్లు పెడుతున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలోనూ ఆయన అచ్చెన్నకు క్లాస్ పీకారట. సరిగా పనిచేయలేకపోతున్నావంటూ మిగతా శాఖల్లో వేలు పెట్టొద్దన్నట్లుగా ఇండైరెక్టుగా అన్నారని తెలుస్తోంది.
    
అయితే.. ఇంతకాలం ముద్దొచ్చిన అచ్చెన్న ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు నచ్చడం లేదనడానికి సమాధానాలు కనిపిస్తున్నాయంటున్నారు టీడీపీ నేతలు. అచ్చెన్నకు చంద్రబాబు మంచి ప్రయారిటీ ఇస్తుండడంతో ఆయన ఇంకా బలపడిపోతారేమో అని భయపడ్డ కొందరు సీనియర్లు మెల్లమెల్లగా చంద్రబాబు వద్ద చేరి ఆయనకు వ్యతిరేకంగా ఇంజెక్టు చేయడం మొదలుపెట్టారట. చెప్పుడు మాటలు విన్న చంద్రబాబు అవన్నీ మనసులో ఉంచుకుని అచ్చెన్నపై లోలోన అక్కసు - కోపం - అనుమానం అన్నీ పెంచుకుంటున్నారట. పైకిబాగానే ఉంటున్నా సందర్భం వస్తే చాలు అచ్చెన్నపై ఆగ్రహించడానికి కారణం ఇదేనంటున్నారు.
    
రీసెంటుగా చంద్రన్నబీమా పధకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని అచ్చెన్నపై చంద్రబాబు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పథకంలో చేరినవారు చనిపోతే స్థానిక స్వయం సహాయక సంఘం సభ్యుల్ని వారి ఇంటికి పంపించి, రూ.5వేలు అందించాలని అనుకున్నాం. అది కూడా చేయలేకపోతే ఎలా?’ అని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తంచేశారట.  పెద్ద నోట్ల రద్దుతో డబ్బు సర్దుబాటు చేయలేకపోయామని ఒక అధికారి సమాధానం ఇవ్వగా ఆయనపై కూడా ఫైర్ అయ్యారు.  ఆ వెంటనే అచ్చెన్నాయుడును ఉద్దేశించి ‘నీ శాఖపై దృష్టిపెట్టు అని చంద్రబాబు అనడంతో అచ్చెన్నాయుడికి అసలు విషయం అర్థమైందని చెబుతున్నారు.  తన జిల్లాకు సంబంధించి పనుల్లో ఇతర శాఖల అధికారులను ప్రశ్నిస్తుండడం వంటి చర్యల నేపథ్యంలో తనపై చంద్రబాబుకు మిగతా మంత్రులు కంప్లయింట్లు చేస్తున్నారని అచ్చెన్న భావిస్తున్నారట.
    
అయితే.. టీడీపీ వర్గాల్లో దీనిపై మరో కథనం కూడా వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకే చెందిన సీనియర్ లీడర్ కళావెంకటరావు ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కోసం ట్రయ్ చేస్తున్నారు. కానీ.. ఉత్తరాంధ్రలో అచ్చెన్న ఇప్పటికే బలమైన మంత్రిగా మారారు. దీంతో తాను మంత్రి పదవి పొందే లోగా అచ్చెన్నకు చంద్రబాబు వద్ద వేల్యూ తగ్గేలా చేసేందుకు కళా కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారని టాక్. కళా, లోకేశ్ లకు మంచి సాన్నిహిత్యం ఉండడంతో ఆయన ప్రభావంతో లోకేశ్ కూడా అచ్చెన్నపై మండిపడుతున్నారని.. లోకేశ్ ఫీడ్ బ్యాక్ తో చంద్రబాబు కూడా ఇదే ధోరణిలో సాగుతున్నారటి వినిపిస్తోంది. అచ్చెన్నకు అన్యాయం చేసేందుకు, ఆయన్ను తొక్కేందుకు టీడీపీలో పెద్ద ముఠాయే ఒకటి సిద్ధమైందని.. అది చంద్రబాబును వాడుకుంటోందని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News