చంద్రబాబు మంత్రివర్గంలో మార్పులు?

Update: 2016-07-08 10:04 GMT
కేంద్రంలోని నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ తరువాత తాజాగా మహారాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలోనూ మంత్రివర్గాన్ని విస్తరించారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ ప్రభుత్వం కూడా మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.   రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలు అందుకు కారణమవుతున్నాయి.  కొందరు సీనియర్ మంత్రులను తొలగించడమో - శాఖలు మార్చడమే తప్పనిసరని చంద్రబాబు భావిస్తున్నారట. అదే సమయంలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనూ మార్పుచేర్పులకు ఆయన తెరతీస్తున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభావం కారణంగా ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నుంచి హోంశాఖ తప్పించి - మరో శాఖకు మార్పు చేయవచ్చని వినిపిస్తోంది. ముద్రగడ - చినరాజప్ప ఇద్దరూ ఒకే సామాజికవర్గం వారు కావడంతో తుని సంఘటన విషయమై కేసు వ్యవహారంలో తలనొప్పిగా మారుతోందని భావిస్తున్నారు. ఈ శాఖను ఉత్తరాంధ్రలో ఉత్సాహంగా మంత్రి పదవిని నిర్వహి స్తున్న అచ్చెంనాయుడుకు దక్కవచ్చని అనుకుంటున్నారు. అదే నిజమైతే అచ్చెన్నాయుడుకి కీలక పదవి దక్కినట్లే అనుకోవాలి.

మరోవైపు పురపాలక మంత్రి  నారాయణకు శాఖ మార్పు తప్పనిసరని తెలుస్తోంది.  రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కీలకంగా మారనున్న నేపథ్యంలో నారాయణను తప్పించాలని చంద్రబాబు అనుకుంటున్నారట.  నారాయణ పనితీరుమీద చంద్రబాబు తృప్తిగా లేరని, ఎన్నికల నాటికి ఆ శాఖను వేరొక సమర్ధుడికి అప్పగిస్తే మంచి ప్రయోజనాలు సాధించవచ్చని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది.  అలాగే విజయవాడలో రహదారుల విస్తరణ పేరుతో దేవాలయాల విధ్వంసం పట్ల సంఘ్‌ పరివార్ ఆగ్రహంగా ఉంది. బీజేపీ నేత మాణిక్యాలరావే ఏపీలో దేవాదాయ మంత్రిగా ఉన్నా ఇలా జరగడమేంటని బీజేపీ వర్గాలు అంటున్నాయి.  మరో బిజెపి శాసనసభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆరోగ్య శాఖామంత్రి వ్యవహరిస్తున్నా ఆ పార్టీ కార్యకర్తల పట్ల పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరు రాష్ట్ర బిజెపి మంత్రులూ తెలుగుదేశం వారితో మమేకమయ్యారని, కాబట్టి వారిని వెనక్కి పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.  ఒకవేళ అదే జరిగి మంత్రి మాణిక్యాలరావు తప్పించి ఎపి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశముంది.  ఆయన స్థానంలో రాజమండ్రి శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ అదే సామాజికవర్గం కనుక ఆయన బెర్తు దొరకవచ్చు.  చంద్రబాబు రెండేళ్ల పాలన పూర్తయిన తరువాత జరిపించిన తాజా సర్వే ఫలితాలను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు సర్వేల ఫలితాల ఆధారంగానూ బాగా పనిచేస్తున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని అనుకుంటున్నారు. ఈ మార్పుచేర్పులకు ముహూర్తం ఎప్పుడన్నది చంద్రబాబు ఇంకా నిర్ణయించాల్సి ఉంది.
Tags:    

Similar News