మ‌హానాడులో బాబు మ‌ళ్లీ వేశాడు

Update: 2018-05-27 09:34 GMT
మ‌హానాడు వేదిక‌గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి సొంత‌డ‌బ్బా కొట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం హైద‌రాబాద్ నిర్మాణం, హైటెక్ సిటీ స్థాప‌న‌, బేగంపేట ఎయిర్ పోర్టు మ‌న ఘ‌న‌తే అని తెలంగాణ మ‌హానాడులో ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగుతున్న టీడీపీ మ‌హానాడు వేదిక మీద ఈ ప్ర‌పంచంలో తెలుగు విద్యార్థులు స‌త్తా చాటుతున్నారంటే అది మ‌న ఘ‌న‌తే అని ప్ర‌క‌టించారు.

యువతకు ప్రోత్సహం ఇచ్చి బాగా చదువుకునేలా చేశాం. మ‌నం ఐటీని అభివృద్ధి చేయడం ద్వారా విదేశాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారు. రాష్ట్రాన్ని విభ‌జించి ఆదాయాన్ని తెలంగాణ‌కు, అప్పుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఇచ్చార‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఏపీలో 60లక్షల మంది, తెలంగాణలో 10 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రను అభివృద్ధి చేసే శక్తి ఒక్క టీడీపీకే మాత్రమే ఉందని నమ్మి ప్రజలు మనకు పట్టం కట్టార‌ని, ఇక ముందు విజ‌యం మ‌న‌దే అని అన్నారు.

నా కష్టార్జితం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌ అభివృద్ధి ఫలితాలు తెలంగాణ ప్రజలకు దక్కాయని, హైద‌రాబాద్ కంటే ఎక్కువ‌గా  అమరావతిని అభివృద్ధి చేస్తాన‌ని చంద్ర‌బాబు అన్నారు. టీడీపీ పాల‌న‌లో తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని,  పదేళ్ల కాంగ్రెస్‌ పాలన అంతా అవినీతిమయమని, వైఎస్‌ హయాంలో రాష్ట్రం అప్రతిష్టపాలైందని అన్నారు.

తెలుగువారు ఎక్కడున్నా వారి బాగోగులు చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం అని, విభజన సమయంలోనూ రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేయాలని పోరాడామ‌ని, ప్రజలు నామీద, టీడీపీ మీద నమ్మకం పెట్టుకున్నారని అందుకే అధికారంలోకి వచ్చిన వెంట‌నే విద్యుత్ కొర‌త లేకుండా చేశామ‌ని, ఇక ముందు భవిష్యత్తులో విద్యుత్‌ ఛార్జీలు పెంచమ‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. నాలుగేళ్ల‌లో అమ‌రావ‌తి నిర్మాణం అడుగు ముందుకు ప‌డ‌లేదు మ‌రి ఎప్పుడు బాబు ఎప్పుడు అభివృద్ది చేస్తారో ?  వేచిచూడాలి.
Tags:    

Similar News