చంద్ర‌బాబు పార్టీల‌కు స్పాన్స‌ర్ గా మారుతారా?

Update: 2018-12-09 08:21 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జాతీయ‌స్థాయి రాజ‌కీయ‌వ‌ర్గాల‌ దృష్టిని ఆక‌ర్షించాయి. అందుకు ప్ర‌ధాన కార‌ణం ద‌శాబ్దాల వైరాన్ని ప‌క్క‌న‌పెట్టి కాంగ్రెస్ - టీడీపీ ఒక్క‌ట‌వ్వ‌డం. తెలంగాణ‌లో ఫ‌లితాలెలా ఉన్నా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల పొత్తు కొన‌సాగే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. అంతేకాదు కేంద్రంలో బీజేపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌రికొన్ని భావ‌సారూప్య పార్టీల‌ను త‌మ‌తో చేర్చుకోనున్నాయి.

బీజేపీయేత‌ర పార్టీల‌ను ఒక్క‌టి చేసే ప‌నిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికే ప్రారంభించారు. ఇటీవ‌ల ప‌లుమార్లు దిల్లీకి వెళ్లి బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ త‌దిత‌ర నేత‌ల‌ను క‌లిశారు. త‌మ‌తో క‌లిసి న‌డ‌వాల‌ని ఆహ్వానించారు. తెలంగాణ‌లో పోలింగ్ పూర్త‌వ్వ‌డంతో ఇక మ‌ళ్లీ జాతీయ రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు దృష్టిపెట్ట‌బోతున్నారు. ఇందులో భాగంగానే సోమ‌వారం ప‌లువురు బీజేపీయేత‌ర నేత‌ల‌తో ఆయ‌న భేటీ కాబోతున్నారు.

చంద్ర‌బాబు కాంగ్రెస్‌ తో క‌లిసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న‌పై ప‌లు ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్‌కు ఆయ‌న నిధులు స‌మ‌కూర్చార‌న్నది అందులో ప్ర‌ధాన‌మైన‌ది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారానికే చంద్ర‌బాబు దాదాపు రూ.200 కోట్లు ఖ‌ర్చుపెట్టార‌ని చెప్పుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుతో బీజేపీయేత‌ర నేత‌ల భేటీ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే.. బీజేపీయేత‌ర పార్టీలు కొన్ని ప్ర‌స్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయ‌ట‌. అందుకే చంద్ర‌బాబుతో భేటీ అయ్యాక ఆయా పార్టీల నేత‌లు ఆయ‌న్ను ఫండ్స్ కోరే అవ‌కాశ‌ముందట‌. ఆర్థికంగా త‌మ కంటే ఎంతో మెరుగైన కాంగ్రెస్‌కే ఏకంగా రూ.200 కోట్లు ఇవ్వ‌గ‌లిగిన బాబు త‌మ‌కు ఎంతో కొంత ఇవ్వ‌క‌పోరు అని ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ట‌.

ఇక చంద్ర‌బాబు కోణం నుంచి చూస్తే.. బీజేపీని ఓడించ‌డ‌మే ఆయ‌న ప్ర‌ధాన ల‌క్ష్యం. అందుకే బ‌ద్ధ శ‌త్రుత్వాన్ని ప‌క్క‌న‌పెట్టి మ‌రీ కాంగ్రెస్‌తో చేతులు క‌లిపారు. ఆ పార్టీ త‌ర‌ఫున తెలంగాణ‌లో కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చుపెట్టారు. కాబ‌ట్టి ఈ ప‌రిస్థితుల్లో బీజేపీయేత‌ర పార్టీలు నిధులు కోరితే ఆయ‌న తిర‌స్క‌రించే అవ‌కాశాలు దాదాపుగా లేవ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News