బాబూ వినవా...ఫిరాయింపుల కథ ఒకటి !

Update: 2018-12-01 07:09 GMT
బాబూ వినరా... అన్నదమ్ములా కథ ఒకటి... ఇది పాత సినిమాలో సూపర్ హిట్‌ అయిన పాట.  ఇదే పాట సినిమాలో ఆనంద సమయంలోను - విషాద సమయంలోను కూడా వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి విషయంలోను ఇదే పాట రిపీట్ అవుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్‌ తో పాటు తెలంగాణ జన సమితి - సీపీఐలతో ప్రజాకూటమిగా ఏర్పడ్డారు. తెలుగుదేశం నాయకులు. 2014 సంవత్సరంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వారంతా కారెక్కేశారు. ఈ పరిణామంతో చంద్రబాబు నాయుడు షాక్‌ కు గరైయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఫిరాయింపుదారుల పాటను విషాదంగా పాడుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. కొందరికి మంత్రి పదవులు సైతం ఇచ్చారు. ఈ సమయంలో ఫిరా‍యింపుదారుల పాటను ఆనందంగా పాడుకున్నారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికలలో  బాబూ వినరా.. పాటను మళ్లీ విషాదంగా పాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించి కారు ఎక్కిన నాయకులను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం ఆయన వారం రోజులుగా ఆంద్రప్రదేశ్‌ ను వదలి హైదారబాదులోనే మకాం వేశారు. రాజకీయంగా తన వల్ల ఎంతో లబ్ది పొంది మంత్రి పదవులు కూడా పొందిన వారు తనకు ప్రత్యర్దులుగా ఎదురు నిలవడం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న 13 స్దానాలలోను అభ్యర్దులందరూ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు బాబు. అయితే తెలుగుదేశం అభ్యర్దులు పోటీ చేస్తున్న స్దానాలలో  విజయం దక్కడం అంత సులభం కాదని - సర్వేలు చెబుతున్నాయి. ఇదీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి మింగుడుపడటం లేదు.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రంలో అదే జరిగితే ఎందుకు గింజుకుంటున్నారని ఆంధ్ర‌ప్రదేశ్‌ లోను - తెలంగాణలోను తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఫిరాయింపులు ప్రోత్సహంచిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో అదే షాక్ తగిలితే ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో... ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో  నైతిక విలువలను లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ విలువల గూర్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అప్పుడెప్పుడో సినిమాలో వచ్చిన పాట బాబూ వినరా... ఎప్పటికి బాబును వెంటాడుతూనే ఉంటుందని చెబుతున్నారు.


Tags:    

Similar News