రామోజీతో చంద్రబాబు అన్ని గంటల ఏకాంత భేటీ?

Update: 2022-11-12 04:44 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంతకంతకూ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది వ్యవధిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం.. ఏపీలో మరో ఏడాదిన్నర వ్యవధి ఉండటం తెలిసిందే. అయినప్పటికీ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. ఎవరికి వారు తమ శక్తుల్ని పునరేకీకరణ చేసుకుంటున్నారు.

ఇలాంటి వేళలో.. కీలక భేటీలకు తెర లేస్తోంది. అయితే.. మిగిలిన భేటీలకు భిన్నంగా టీడీపీ అధినేత.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతు.. మీడియా మొగల్ గా కీర్తించే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రామోజీ ఫిలింసిటీకి వెళ్లిన చంద్రబాబు.. రామోజీరావును కలిశారు. వీరిద్దరి మధ్య ఏకాంత భేటీ ఏకంగా నాలుగు గంటల పాటు సాగినట్లు కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం మూడున్నర గంటల పాటు సాగినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా వీరిద్దరి మధ్య భేటీ సుదీర్ఘంగా సాగిందన్నది మాత్రం స్పష్టం. ఇదిలా ఉంటే.. ఈ భేటీకి సంబంధించిన ఎలాంటి ప్రకటన ఇరు వర్గాల నుంచి విడుదల కాలేదు.

సహజంగా రామోజీరావు తనను కలిసిన వారికి సంబంధించిన ఒక ఫోటోను.. చిన్న వార్తను అయినా పబ్లిష్ చేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా ఈ విషయంపై ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. అదే సమయంలో చంద్రబాబు.. తాను కలిసిన వారు.. తనను కలిసిన వారికి సంబంధించిన వివరాల్ని మీడియా గ్రూప్ నకు అందజేస్తారు. రామోజీతో భేటీ విషయం మీదా మీడియాకు ఎలాంటి సమాచారం లేదు.

ఇంతకూ వారిద్దరి మధ్య భేటీ జరిగిన టైం మాత్రం ఆసక్తికరమని చెప్పాలి. చంద్రబాబు కుమారుడు.. ఆయన రాజకీయ వారసుడిగా పేరున్న నారా లోకేశ్.. శుక్రవారం ఉదయమే.. తన సుదీర్ఘ పాదయాత్ర గురించిన సమాచారం బయటకు వచ్చింది. దాదాపు 400 రోజులు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు సిద్ధమై.. అందుకు జనవరి 27ను ముహుర్తంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ముగియనుంది.

ఈ పాదయాత్రకు సంబంధించిన ప్రకటన విడుదలైన రోజే.. రామోజీని చంద్రబాబు కలవటం అనుకోకుండా జరిగిందా? లేదంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా చేపట్టారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న వేళ.. జనసేన అధినేత పవన్ ను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన వేళలో.. మరోవైపు రామోజీతో చంద్రబాబు భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. మరి..ఈ భేటీలో ఏం చర్చించారన్న విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని చెప్పకతప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News