టీడీపీకి టానిక్ గా మారిన ఖమ్మం శంఖారావం సభలో బాబు కీలక వ్యాఖ్యలు

Update: 2022-12-22 04:14 GMT
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో దుకాణం మూసేయటం తప్పించి మరో మార్గం లేదన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయినప్పటికి జగన్మోహన్ రెడ్డి మాదిరి తెలంగాణను వదిలేయని చంద్రబాబు.. ఏదో ఆశతో పార్టీని కంటిన్యూ చేయటం తెలిసిందే. ఎప్పుడైతే గులాబీ బాస్ కేసీఆర్ నోటి నుంచి బీఆర్ఎస్ అన్న మాట వచ్చి.. అందుకు తగ్గట్లు పరిణామాలు చోటు చేసుకున్న వేళ.. అనూహ్యంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎంత సరైనదన్నదిగా మారింది.

బీసీ నేత కాసాని చేతికి టీడీపీ తెలంగాణ విభాగ కళ్లాల్ని అప్పజెప్పటం ద్వారా సరైన నిర్ణయాన్ని తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే తాజా ఖమ్మం శంఖారావం  బహిరంగ సభ జరిగినట్లుగా చెప్పాలి. అంచనాలకు మించి హాజరైన జనసందోహాన్ని చూసిన తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అంతే లేకుండా పోయిన పరిస్థితి. ఈ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన ప్రసంగంలో కీలక అంశాల్ని చూస్తే..

-  తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డమీదనే.. హైదరాబాద్‌లోనే. ఇక్కడ అభివృద్ధి, సంక్షేమానికి పునాదులు వేసింది తెలుగుదేశమే. తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది.. అనే వారికి ఖమ్మం సభే సమాధానం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లాంటి ముఖ్యనాయకులు ఎవరూ లేకపోయినా ఖమ్మం సభకు ఇంత భారీ ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలిరావడం నాకెంతో ఆనందంగా ఉంది.

-  తెలంగాణలో పార్టీ మళ్లీ బలోపేతం అవుతుందన్న నమ్మకం, విశ్వాసం అందరిలోనూ కలుగుతోంది. తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలి. అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం. అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం.

-  తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారని, అందరికంటే ముందుగా పేదవారికి పక్కా ఇల్లు, తినడానికి తిండి కట్టుకోవడానికి దుస్తులు, రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్ర్తాలు, రైతులకు 50శాతం రాయితీతో విద్యుత్తు పథకానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం ఆవిర్భావంతోనే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి పునాదులు పడ్డాయి.

-  రైతులను, ప్రజలను పట్టి పీడిస్తున్న పటేల్‌ పట్వారీ వ్యవస్థను ఎన్టీఆర్‌ ఒక్క కలం పోటుతో రద్దుచేసి, దొరస్వామ్యాన్ని రూపుమాపి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోశారు.

-  బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత టీడీపీదే. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడున్న ఏపీ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి వేగంగా జరిగాయి.

-   రెండుగా విడిపోయిన రాష్ట్రాలను కొందరు మళ్లీ కలవాలంటూ సిగ్గు, శరం లేకుండా చెబుతున్నారు.  ఏపీ, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాటూ అభివృద్ధి చెందాలి. దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో ఉండాలన్నమా విధానం.

-  గతంలో సైబరాబాద్‌ నిర్మించి ఐటీ రంగంలో సృష్టించిన సంపదతో హైదరాబాద్‌ ముందుకు పోతోంది.  ఏపీని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఒక విజన్‌తో వెళ్లానని, ప్రణాళిక రూపొదించానని, కానీ.. అక్కడ చేతకాని ముఖ్యమంత్రి విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు.

-  ఏపీలో అభివృద్ధి పాతాళంలోకి పోయిందని, మళ్లీ టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది.

-  ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికీ లభించని అవకాశం నాకు దక్కింది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లపాటు ప్రతిపక్షనేతగా ఉన్న రికార్డు నాదే.

-  హైదరాబాద్‌ నగర అభివృద్ధికి పునాదులు వేశా. ముందుచూపుతో విజన్‌ 2020 పేరుతో ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు బిల్‌గేట్స్‌ను ఎంతో కష్టపడి కలిసి, మెప్పించి 14 నెలల్లో హైటెక్‌సిటీని నిర్మించా. ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పించా. 50 ఇంజనీరింగ్‌ కళాశాలల సంఖ్యను 250కి పెంచి తెలుగువారిని దేశ విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడేలా ఉద్యోగ అవకాశాలు కల్పించాం.

-  ముందుచూపుతో హైదరాబాద్‌లో బయోటెక్నాలజీతో జీనోమ్‌ వ్యాలీని ఏర్పాటు చేయించడం ద్వారానే ప్రమాదకరమైన కరోనాకు మందులు కనుగొని ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది.

-  క్రీడల అభివృద్ధి కోసం గచ్చిబౌలి స్టేడియం నిర్మించాం. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, బిజినెస్‌ స్కూల్‌ స్థాపించాం. జాతీయ రహదారులు నిర్మించాం.

-  మా హయాంలో భద్రాచలంలో నిర్మించిన కరకట్ట వల్లే ఇటీవల వచ్చిన వరదల నుంచి పట్టణం క్షేమంగా బయటపడింది. తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిని టీడీపీ ఆధ్వర్యంలో సాధిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News