డీజీపీకి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2021-10-21 13:30 GMT
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ఆఫీసుపై దాడి జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 'నీలాంటి వాళ్ల‌ను ఎంతో మందిని చూశాన‌ు. ఏం చేస్తావో.. చేసుకో'' అని చంద్రబాబు స‌వాల్ చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేపట్టారు. పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్ష కొనసాగనుంది.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయారు. టీడీపీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కోరలేదని,  ఇవాళ ప్రజల దేవాలయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్టీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నందుకే రాష్ట్రపతి పాలన కోరామని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి చేసిన వారిని పోలీసులు దగ్గర ఉండి సాగనంపటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసినవారితో ఎదురు కేసులు పెట్టించిన డీజీపీని ఏమనాలని ప్రశ్నించారు. చేతకాకపోతే పోలీస్ వ్యవస్థను మూసేయండని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యాలయాలే లక్ష్యంగా దాడులు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అనేక చోట్ల టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని, దాడుల విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదని తప్పుబట్టారు. ఇది టీడీపీపై జరిగిన దాడి కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ భవన్‌‌ను 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్నారని, ఇది దేవాలయమని బాబు తెలిపారు. దాడి జరిగిన చోటే దీక్ష చేయాలని సంకల్పించానని వివరించారు. దాడుల విషయం చెబుతామంటే స్పందించరా? అని పశ్నించారు. తాము ఫిర్యాదులు చేస్తే.. తమపైనే కేసులా? అని ఆయన మరోసారి ప్రశ్నించారు. పట్టాభి ఇంటిపై దాడి జరిగితే నిందితులను అరెస్ట్ చేయకపోగా పట్టాభినే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. పట్టాభి వాడిన భాష తప్పు అన్నారు.. జగన్, మంత్రులు వాడిన పదజాలంపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజంపై పోరాడాలనే దీక్ష చేస్తున్నానని చంద్ర‌బాబు స్పష్టం చేశారు. మాస్కు అడిగాడని డాక్ట‌ర్ సుధాకర్‌ను పిచ్చోడిగా మార్చేశారని, ఎంపీ రఘురామకృష్ణరాజును విచక్షణా రహితంగా కొట్టారని గుర్తుచేశారు. డ్రగ్స్‌ ఇదే మాదిరిగా వస్తే జాతి నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. డ్రగ్స్‌ సరఫరా చేసేవారిని పట్టుకోమంటే తమపైనే కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

మెడలు వంచైనా సరే డ్రగ్స్‌ని నియంత్రించేవరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. 40ఏళ్లలో చాలామందిని చూశానని, ఎంతోమంది సీఎంలను చూశానని చెప్పారు. మీకు శిక్షపడేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జగన్ క్యారెక్టర్‌లోనే లోపం ఉందని తప్పుబట్టారు. రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. చట్టం కొంతమంది చుట్టం కావడానికి వీల్లేదన్నారు. ఇప్పటికైనా మారాలని వైసీపీ నేతలను కోరుతున్నానని, ఇకనైనా పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలో ఆర్టికల్-356 విధించాలని కోరామని చంద్రబాబు తెలిపారు. కులమతాల మధ్య వైసీపీ చిచ్చు పెట్టిందని మండిపడ్డారు. ఎప్పుడైనా ఆలయాలు, మసీదులు, చర్చిలపై దాడులు జరిగాయా?.. అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు గతానికి భిన్నంగా ఆగ్రహంతో ఊగిపోయారు. దీక్ష ప్రారంభంలోనే ఆయనలో అసహనం కనిపించిందని పలువురు చెబుతున్నారు. చంద్రబాబు తీరుపై పలు చర్చలు ప్రారంభమయ్యాయి.
Tags:    

Similar News