బాబోయ్ బాబు స్పీడ్ : 70 మంది అభ్యర్ధుల లిస్ట్ రెడీ...?

Update: 2022-07-12 09:41 GMT
తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు వయసు ఏడు పదులు దాటింది. కానీ మనిషి హుషార్ మాత్రం పాతికేళ్ల లోపే అని అంటున్నారు. బాబు ఎపుడూ అదే చెబుతారు కూడా. తాను ఎవర్ గ్రీన్ అని, తానే యంగ్ అని అంటారు. నిజానికి ఆలోచిస్తే చంద్రబాబు ఎన్ని ఎన్నికలను చూడలేదు, అయినా ఆయనలో అదే ఉత్సాహం అదే కమిట్మెంట్, అదే జోష్. ఇపుడు కూడా ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు చంద్రబాబు.  వాస్తవానికి  2024లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. కానీ చంద్రబాబు అయితే అసలు దాన్ని నమ్మడంలేదు.

జగన్ వరస చూస్తూంటే ముందస్తునకు వెళ్తారని బాబు భావిస్తున్నారుట. దాంతో తాను ఎక్కడా వెనకబడిపోకూడని ఆయన ముందుగానే జనాల్లోకి వచ్చేశారు. వచ్చిన చంద్రబాబు ఊరుకుంటున్నారా. ఊరు ఊరుకూ వెళ్ళి గట్టి అభ్యర్ధులను అక్కడే డిసైడ్  చేసి వారి పేర్లను  అలా ప్రకటించేస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నా అసంతృప్తి గొంతులకు వినిపిస్తున్నా కూడా బాబు మాత్రం  బేఫికర్ గా తన మాటనే శాసనంగా ప్రకటిస్తున్నారు.

బాబు ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో లిస్ట్ ను  ముందేసుకుని వడపోత పనులలో యమ బిజీగా  ఉన్నారని అంటున్నారు.ఇప్పటికే  దాదాపుగా డెబ్బై నియోజకవర్గాలలో ఆయన అభ్యర్ధులను ఎంపిక చేశారని చెబుతున్నారు. వారిని జిల్లాల పర్యటనల్లో ఎక్కడికక్కడ ప్రకటిస్తూ ఈ రోజు నుంచే జనాల్లో ఉండాలని కోరుతున్నారు.

ఈ విధంగా వారు ప్రజలలో ఉండడం వల్ల రేపటి రోజున విజయావకాశాలు  ఎక్కువగా ఉంటాయని బాబు అంచనా కడుతున్నారు. పొత్తులతో సంబంధం లేకుండా డెబ్బై మంది లిస్ట్ ని బాబు ప్రిపేర్ చేయడం వెనక భారీ వ్యూహమే ఉంది అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు.

ఈ డెబ్బైలో కచ్చితంగా యాభై సీట్లు గెలిచే చాన్స్ ఉంటే మిగిలిన 105 సీట్లో పొత్తులలో కొన్ని సీట్లు పోయి కచ్చితంగా మరో ఎనభై సీట్లలో తామే ఎటూ పోటీ చేసేలా ప్లాన్ చేసుకున్నారు అని అంటున్నారు. అలా వందకు తగ్గకుండా సీట్లను పక్కాగా గెలుచుకునే ప్లాన్ తోనే బాబు ముందుకు కదులుతున్నారని చెబుతున్నారు.

దాంతో చాలా తొందరలోనే ఈ డెబ్బై సీట్లకు సంబంధించిన లిస్ట్ ప్రకటిస్తారని చెబుతున్నారు. అదే విధంగా వివాదాలు లేని చోట పొత్తుల ఆలోచనలు రాని చోట అభ్యర్ధులను ప్రకటించుకుంటూ పోవాలని అదే రేపటి ఎన్నికల్లో భారీ మేలు చేస్తుందని బాబు నమ్ముతున్నారు. మొత్తానికి బాబు ఎన్నడూ లేని విధంగా రూట్ మార్చేశారు. స్పీడ్ పెంచేశారు. మరి ఈ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో అని కంగారు పడడమే ఇపుడు తమ్ముళ్లకు మిగిలింది. మరో వైపు టీడీపీతో  పొత్తుల కోసం చూసే పార్టీలు అయితే ఇక పరుగులు పెట్టాల్సిందే అన్నట్లుగా బాబు నిర్ణయాలు ఉంటున్నాయి.
Tags:    

Similar News