బాబు న్యూ స్ట్రాటజీ : ఒక్క హామీ కూడా ఇవ్వకపోతే...?

Update: 2022-06-09 12:30 GMT
వచ్చే ఎన్నికలు టీడీపీకి అతి ముఖ్యమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని రకాలుగా కునారిల్లిన టీడీపీకి ఈ ఎన్నికల గెలుపు అత్యవసరం, ఈ ఎన్నికల బట్టే టీడీపీ నాలుగు దశాబ్దాల ప్రస్థానం కొత్త మలుపు తిరుగుతుందా లేదా అన్నది కూడా తేలిపోతుంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నిక కోసం కొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. గతంలో ఉన్న పార్టీ మొహమాటాలకు ఎటూ స్వస్తివాచకం పలకనుంది.  

ముందుగా సీనియర్లకు చెక్ పెడుతూ కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కించనుంది. అదే సమయంలో ప్రజలను ఓట్లు అడిగే విషయంలో కూడా కొత్త సంస్కరణలకు తెర తీయనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో వెల్లువలా హామీలు ఇచ్చేసే సంప్రదాయానికి తెరదించబోతోంది అని అంటున్నారు

అంటే ప్రజలకు ఏం కావాలో చూసి మరీ వాటినే ఎన్నికల మ్యానిఫేస్టోలో పెట్టనున్నారు. ఇక అనుచితంగా ఉచిత వరాలు ఇస్తూ పోరాదని కూడా పార్టీ ఆలోచిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఉచితాల మీద ఇండైరెక్ట్ గా టీడీపీ విమర్శలు చేస్తోంది. ఏపీని వైసీపీ అప్పుల పాలు చేసింది అని తరచూ  చంద్రబాబు సహా టీడీపీ నేతలు అంతా ఆరోపిస్తున్నారు.

మరి వైసీపీ అలవికాని హామీలు ఇవ్వడం వల్లనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో హామీలు ఇచ్చే విషయంలో టీడీపీ ఆచీ తూచీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది ఆ పార్టీకి అనేక విధాలుగా సవాల్ కానుంది. వైసీపీని ఘాటుగా విమర్శించి తాము కూడా అవే హామీలు ఇస్తే జనాలు మెచ్చకపోగా వైసీపీ వైపే మళ్ళుతారు. అదే టైమ్ లో ఆ హామీల అమలునకు కొత్త అప్పులు కూడా చేయాలి.

మరో వైపు ఏపీ జనాలలో మెజారిటీ అభివృద్ధి కోరుకుంటున్నారు అన్న సంగతి టీడీపీ గ్రహించింది అంటున్నారు. ఇక విశేష అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు ఏపీకి ఏమి చేయాలి, ఏపీకి నిజానికి ఎన్ని నిధులు ఎన్ని ఉన్నాయి. అప్పుల సంగతి ఏంటి అన్నది బాగా తెలుసు. అందువల్ల ఏ రకమైన హామీలు ఇవ్వకుండా ఖజానాకు గుదిబండ కాకుండా వయా మీడియాగా ఉండే విధానాన్ని ఈసారి టీడీపీ అనుసరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక చంద్రబాబుకు అభివృద్ధి చేస్తారు అన్న ఇమేజ్ ఉంది. దాన్ని కాపాడుకోవాలన్న చేసి చూపించాలన్నా ఖజానాకు భారమయ్యే వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటికి అనేక సభలు సమావేశాలు నిర్వహించిన బాదుడే బాదుడు అంటూ ప్రజల మధ్యకు వచ్చినా టీడీపీ ప్రతిష్టాత్మకంగా మహానాడుని నిర్వహించినా కూడా ఎక్కడా ఒక్క హామీ కూడా వచ్చే ఎన్నికలకు సమంధించి టీడీపీ ఇప్పటిదాకా ఇవ్వని సంగతిని గుర్తు చేస్తున్నారు.

ఈసారి ఒక డిఫరెంట్ వేలో వెళ్లి అన్ని వర్గాల మెప్పు పొందాలని టీడీపీ చూస్తోంది అంటున్నారు. మరి తాయిలాల మీద ఆధారపడి వాటికి ఆకర్షితులు అవుతున్న సమాజంలో టీడీపీ కొత్త స్ట్రాటజీ ఏ రకంగా సక్సెస్ అవుతుంది. ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది అన్నది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News