జోగయ్యం పుస్తకంలో 72వ పేజీ వివాదం

Update: 2015-11-06 05:31 GMT
'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో రాసిన విషయాలన్నీ వాస్తవమేనని, తాను అందులో ఎవరినీ కించపర్చలేదని  మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తెలిపారు. వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని... ఆ విషయం తానే కాకుండా అప్పట్లో ప్రజలు కూడా బలంగా నమ్మారని.. అందుకే ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగాయని చెప్పారు.  తన పుస్తకంలోని 72వ పేజీలో ఈ విషయాలన్నీ రాశానని... రంగా హత్య కేసులో చంద్రబాబు - ఉపేంద్రల హస్తం ఉందని అప్పట్లో చెప్పిన మాజీ మంత్రి దండు శివరామరాజు మాటలను తొలుత నేను నమ్మలేదని, సంఘటన జరిగాక బాధపడాల్సి వచ్చిందని చెప్పారు. రంగా హత్యతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని, కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని, కాపులతోపాటు ఎస్సీ - బిసి పేదలు స్పందించడం వల్లే నాడు అల్లర్లు జరిగాయని చెప్పారు. నాటి హత్య గురించి ముందే నిర్ధారించుకుని ఉంటే  హెచ్చరించేవాడినని వివరించారు. తాను సొమ్ముచేసుకునేందుకు గాను పుస్తకానికి ప్రచారం చేసుకోవడానికే తప్పుడు ఆరోపణలతో రాశానని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు వంటి నాయకులు విమర్శలు చేయడం సబబు కాదన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలియాలనే రూ.20కే ఆ పుస్తకం విక్రయిస్తున్నట్లు చెప్పారు. పుస్తకాలు విక్రయించగా వచ్చిన సొమ్మును పాలకొల్లులోని మానసిక వికలాంగుల పాఠశాలకు విరాళంగా ఇస్తున్నట్లు పుస్తకావిష్కరణ సభలోనే ప్రకటించానని గుర్తుచేశారు. 144 పేజీల పుస్తకంలో కేవలం 72వ పేజీలో రాసిన అంశంపైనే టీడీపీ స్పందించడం భావ్యం కాదని జోగయ్య అన్నారు. చంద్రబాబునాయుడుతోపాటు వైఎస్‌ రాజశేఖరరెడ్డి - జగన్‌ - చిరంజీవి - పవన్‌ కళ్యాణ్‌ లపైనా వ్యాఖ్యానించానని, చంద్రబాబుపై వ్యాఖ్యలను కొందరు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చెప్పారు.

అయితే... తన పుస్తకంలో జోగయ్య చంద్రబాబుపై ఆరోపణలు చేయడమే కాకుండా అవి పుస్తకంలో ఏ పేజీలో ఉన్నాయన్నది కూడా పదేపదే చెబుతుండడంపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. చంద్రబాబుపై తప్పుడు రాతలు రాయడమే కాకుండా వాటిని ప్రచారం చేయడం కోసం పదేపదే పుస్తకంలో అవెక్కడున్నాయో పేజీ నంబర్ల సహా చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News