గతాన్ని తవ్వి తీసి డిఫెన్స్ లో పడ్డాడే

Update: 2015-11-03 06:13 GMT
ఏపీ సీనియర్ నేత హరిరామ జోగయ్య చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. నలుగురి మీద బురద జల్లేటప్పుడు.. ఆ బురద ఎంతోకొంత తన చేతికి అంటుకుంటుందన్న సత్యం ఆయనకు బోధ పడి ఉంటుంది. తన రాజకీయ జీవితంలో ఎదురైన అంశాలపై ఒక పుస్తకం రాసి.. తాజాగా విడుదల చేయటం.. అందులో ప్రస్తావించిన అంశాలు చాలావరకూ సంచలనంగా ఉండటంతో ఇప్పుడు రాజకీయ కలకలం చోటు చేసుకుంది.

సదరు పుస్తకంలో ప్రస్తావించిన చాలా అంశాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కొన్నింటిలో నాటి కాంగ్రెస్ నేత వంగవీటి మోహన్ రంగా హత్య ఉదంతం. విజయవాడ రాజకీయాల్ని శాసించటంతో పాటు.. నాటి ఉమ్మడి రాష్ట్రంలో కాపులకు పెద్ద దిక్కుగా ఉంటూ.. కీలక నేతగా ఆవిర్భవిస్తున్న తరుణంలో ఆయన దారుణ హత్యకు గురి కావటం తెలిసిందే.

ఈ హత్య విషయాన్ని అందరూ మర్చిపోయి చాలాకాలమే అయ్యింది. అయితే.. ఆ హత్య ఉదంతాన్ని హరి రామ జోగయ్య తాజాగా తన పుస్తకంలో ప్రస్తావించటం.. రంగా హత్యలో నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించటం కలకలం రేపింది. రంగా హత్యకు స్కెచ్ వేసిన వారిలో చంద్రబాబు కీలకమని.. రంగాకు స్పాట్ పెట్టిన విషయం తనకు ముందే తెలుసంటూ తన పుస్తకంలొ ప్రస్తావించారు.

రంగాను హత్య చేస్తున్న విషయం తనకు శివరామరాజు చెప్పారని.. తనకు తెలిసిన వారం తర్వాత రంగాహత్య జరిగినట్లుగా ఆయన రాసుకొచ్చారు. పుస్తకం చదివిన వారంతా సంధిస్తున్న ప్రశ్నల్లో.. రంగా హత్య గురించి సమాచారం తెలిసినప్పుడు.. ఆ విషయాన్ని జోగయ్య ఎవరికీ ఎందుకు చెప్పలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తన పుస్తకంతో పేర్కొన్నట్లుగా రంగా హత్య గురించి తెలిస్తే.. రాజకీయ నాయకుడిగా వదిలేసినా.. సాటి వ్యక్తి చంపేయటానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసినా సమాచారం ఇవ్వాల్సి ఉంది. అంతకు మించి తన సామాజిక వర్గానికి చెందిన రంగా సన్నిహితులకైనా హెచ్చరించొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

తన పుస్తకంతో సరికొత్త అంశాలతోసంచలనం సృష్టించాలని భావించిన జోగయ్య ఆలోచనకు భిన్నంగా.. ఆయన వైఖరిని పలువెరు వేలెత్తి చూపించటంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ విమర్శల తీవ్రత పెరగటంతో ఢిఫెన్స్ లో పడిన జోగయ్య.. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రంగా హత్య కేసు గురించి  తనకు సమాచారం ఉన్నప్పటికీ.. తాను నోరు విప్పకపోవటంపై వచ్చిన విమర్శలపై మాట్లాడిన జోగయ్య.. తనకు రంగా హత్య గురించి సమాచారం అందినప్పటీకీ.. తనకు దీనిపై నమ్మకం కలగలేదని అందుకే తాను నోరు విప్పి లేదన్నాడు. తనకు సమాచారం అందిన వారానికి రంగాను హత్య చేశారని.. ఈ కేసును విచారించిన సీబీఐ సైతం తనను ప్రశ్నించలేదని..అందుకే తాను చెప్పలేదన్నారు. అంటే.. జోగయ్యకు తెలిసిన చట్టవిరుద్ధమైన విషయాల్ని కూడా చెప్పరన్న మాట. నేరం జరిగే సమయంలో అనుమానంతో చూస్తుండిపోయే ఆయన.. నేరం జరిగిపోయిన తర్వాత మాత్రం తీరిగ్గా పుస్తకం రాయటం లాంటివి చేస్తారన్న మాట. వారేవ్వా.. జోగయ్య.
Tags:    

Similar News