అమ‌రావ‌తిలో కూట‌మి జాబితా..అమ‌రుల స్థూపం వ‌ద్ద ధ‌ర్నా

Update: 2018-11-14 12:19 GMT
రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ను ఓడించడమే ధ్యేయంగా అప్పటివరకు కత్తులు దూసుకున్న పార్టీలు.. మహాకూటమి పేరుతో ఏకమై ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న విప‌క్షాలు ఆదిలోనే చీలిక దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి. ఓ వైపు కోరిన‌న్ని సీట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో మిత్ర‌ప‌క్షాలు భ‌గ్గుమంటుండగా...మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో త‌మ డిమాండ్ ఒక‌టైతే, కేటాయించింది మ‌రొక‌టి అంటూ విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీకి జనసమితి డెడ్‌ లైన్ విధించింది. ఈ సాయంత్రంలోగా మిర్యాలగూడ - జనగామ సీట్ల కేటాయింపుపై తేల్చాలని అల్టిమేటం విధించింది.

మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపానికి చెరుకు సుధాకర్ - చంద్రకుమార్‌ లు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెరుకు మాట్లాడుతూ.. కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని మండిప‌డ్డారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారన్నారు. కూటమి సీట్ల పంపకాల్లో సమాజిక న్యాయమే లేదని దుయ్యబట్టారు. పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా భట్టి విక్రమార్క తమను మహాకూటమిలోకి ఆహ్వానించారని - ఇప్పుడు ఇవ్వకుండా అవమానించడంలో అంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. తమ పార్టీకి ఒక సీటు కేటాయిస్తానన్న కుంతియా.. మొహం చాటేశారని పేర్కొన్నారు. తమను ఢిల్లీకి పిలిచి అవమానించారే తప్ప పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వతంత్రంగా బరిలో దిగుతామని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News