కేసీఆర్ ను కలవరిస్తున్న పాతమిత్రులు...

Update: 2015-05-09 18:37 GMT
టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అని, ఫక్తు రాజకీయాలకు తాము దూరంగా ఉంటామని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇపుడు ఆయన ఉద్యమ సహచరులు గుర్తుచేసుకుంటున్నారు.  తెలంగాణ ఉద్యమం సమయంలో తమను ఆకాశానికి ఎత్తిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమ ఊసే ఎత్తడం లేదని వాపోతున్నారు. అందుకే బలమైన రాజకీయ ప్రతిపక్షం అవసరం ఉందని వారు నిర్ణయానికి వచ్చారు.

 తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్‌, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు చెరుకు సుధాకర్‌ ఆరోపించారు. ఓయూ విద్యార్థులతో సమావేశమైన ఆయన వేదిక విధివిధానాలపై విద్యార్థుల సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును ఎత్తిచూపేందుకు రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అవసరమని ఓయూ విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన చెరుకు సుధాకర్‌ తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరముందని అన్నారు. అందుకే తాము ఈ వేదిక ఏర్పాటుచేశామని, త్వరలోనే పూర్తి కార్యచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు.
Tags:    

Similar News