ముహుర్తం విషయంలో బాబు తప్పు చేశారా?

Update: 2016-10-17 09:11 GMT
అదేం సిత్రమో తెలీదు కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయిన ఏ ముహుర్తం మీదనైనా వివాదం నెలకొంటుంది. గోదావరి మహా పుష్కరాల సమయంలో కావొచ్చు.. అమరావతి శంకుస్థాపన సందర్భంలో కావొచ్చు.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ముహుర్తం విషయంలోనూ పలు విమర్శలు ఎదురయ్యాయి. నమ్మకాల్ని బాగా నమ్మే చంద్రబాబుకే ఇలాంటి కష్టాలు రావటం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు.. ఆయనకు ముహుర్తాలు పెట్టే వారి లెక్కల్ని పలువురు తప్పు పట్టటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి తప్పుల చిట్టా ఒకటి విప్పారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి. ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే.. ముహుర్తాలు పెట్టించుకునే విషయంలో చంద్రబాబు దారుణమైన తప్పులు చేస్తున్నారా? అనిపించటమే కాదు.. ఆయనకు సలహాలు ఇచ్చే వారు ఆయన చేత వరుస తప్పులు చేసినట్లుగా అనిపించకమానదు.

తాజాగా ఆయన చేసిన ఆరోపణలు చూస్తే.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్ లోని సీఎం ఛాంబర్ ప్రవేశం చేసిన ముహుర్తం ఏ మాత్రం సరికాదన్నది చెవిరెడ్డి వాదన. దీనికి ఆయన ఏమంటారంటే.. ‘‘బుధవారం ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్యలో యమగండం ఉంది. ఆ సమయంలో ఉదయం 8.09 గంటలకు సచివాలయంలోకి ఎలా వెళతారు? హిందుమత ఆచారాల ప్రకారం రాహుకాలం.. యమగండం లాంటివి కచ్ఛితంగా పాటిస్తారు. ఒకవేళ ఇలాంటి ముహుర్తంలోనే అయితే చంద్రబాబు తన ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని పెట్టుకుంటారా? అయినా.. శుభకార్యం వేళ ఇంటి యజమాని ఎప్పుడైనా గుమ్మడికాయ కొట్టిన ఆచారం ఎక్కడైనా ఉందా? గుమ్మడికాయ కొట్టాక కాళ్లు కడుక్కోకుండా లోపలికి వెళతారా?’’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.

పుష్కరాల సమయంలో పుష్కర స్నానం చేయటంతో పాటు అనేక సందర్భాల్లో చెప్పులు విడవకుండా పూజలు చేసిన ఘన చరిత్ర చంద్రబాబు సొంతంగా ఆయన ఆరోపించారు. దగ్గరి వారు మరణిస్తే.. కర్మ తీరే వరకూ ఆలయ ప్రవేశం చేయకూడదని తెలిసినా..తిరుమత తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు ఇచ్చి ఆలయాన్ని అపవిత్రం చేసిన ఘనత చంద్రబాబుది అని ఆయన మండిపడ్డారు. రక్తసంబంధీకుల మరణం కారణంగా చంద్రబాబుకు అంటు ఉందని.. కానీ ఆ సమయంలో అమరావతి నిర్మాణం కోసం పుట్టమన్ను.. పవిత్ర జలాలు తీసుకెళ్లారన్న ఆయన.. అదే సమయంలో తన మనమడి శుభకార్యాన్ని మాత్రం చంద్రబాబు వాయిదా వేసుకున్నట్లు ఆరోపించారు. మరిన్ని తప్పుల్ని.. చంద్రబాబుకు సలహాలు ఇచ్చే పండితులు ఆయనకు చెప్పటం లేదా? ఏమైనా.. చెవిరెడ్డి లేవనెత్తిన పాయింట్లను బాబు సన్నిహితులు నోట్ చేసుకొని క్రాస్ చెక్ చేయటం మంచిదన్న వాదన వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News