మంటపుట్టేలా మాట్లాడిన జ‌గ‌న్ ఫైర్ బ్రాండ్‌

Update: 2017-06-09 05:34 GMT
ఏపీ విప‌క్షంలో ఫైర్ బ్రాండ్ల‌కు కొద‌వ‌లేద‌ని చెప్పాలి. మాట‌ల‌తో మంట‌లు పుట్టించే స‌త్తా ఉన్న నేత‌లు చాలామందే ఉన్నారు. అయితే.. వారిలో మొద‌టి మూడు స్థానాల్లో నిలిచే వారిలో చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి ఒక‌రు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సొంత జిల్లాకు చెందిన ఆయ‌న నోటి నుంచి వ‌చ్చే మాట‌లు మంట పుట్టిస్తాయి. ఆయ‌న మాట్లాడే ప్ర‌తి మాట.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు కాలిపోయేలా చేస్తుంది. అలాంటి ఆయ‌న తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీలో మాట్లాడారు. ఏపీ అధికార‌ప‌క్షంపైనా.. ముఖ్య‌మంత్రిపైనా.. పార్టీ నేత‌ల మీదా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

బాబు హ‌యాంలో త‌మ పార్టీ నేత‌ల్ని.. కార్య‌క‌ర్త‌ల్ని ఇబ్బంది పెట్టిన అధికారుల్ని వ‌దిలేదే లేద‌ని తేల్చి చెప్పిన చెవిరెడ్డి.. మ‌రో ఏడాదిన్న‌ర‌లో త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. ఆ త‌ర్వాత త‌మ‌ను ఇబ్బంది పెట్టిన వారు ప‌శ్చాత్తాప ప‌డేలా చేస్తామ‌న్నారు.

అధికార పార్టీ అండ చూసుకొని రెచ్చిపోతున్న వారిపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌టం ఖాయ‌మ‌న్నారు. పూత‌ల‌ప‌ట్టు ఎమ్మెల్యే సునీల్ మంచి డాక్ట‌ర్ అని.. కానీ ఆయ‌న్ను ఇబ్బంది పెడుతూ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ఆయ‌న అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోవ‌టం లేద‌ని మండిప‌డిన ఆయ‌న‌.. త‌ప్పు చేసిన అధికారుల్ని వెంటాడి మ‌రీ చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

అధికారం ఉంది క‌దా అని ఇబ్బంది పెట్టిన వాడు ఎవ‌రైనా స‌రే చ‌ర్య‌లు తీసుకుంటాం. వాళ్లు ఎవ‌రైనా.. ఏ స్థాయి అధికారి అయినా వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. టీడీపీకి.. చంద్రబాబుకు కాలం ద‌గ్గ‌ర ప‌డింద‌న్న ఆయ‌న‌.. అమ‌రావ‌తిలో నూత‌న అసెంబ్లీ భ‌వ‌నాన్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో క‌ట్టిన‌ట్లుగా ప్ర‌భుత్వం చెబుతోంద‌ని.. అయితే జ‌గ‌న్ ఛాంబ‌ర్లోకి నీళ్లు ఎలా వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌లేక‌పోతోంద‌న్నారు. జ‌గ‌న్ ఛాంబ‌ర్లోకే కాదు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చాంబ‌ర్ లోకి.. స్పీక‌ర్ గ‌దిలోకి నీళ్లు వ‌చ్చే ఉంటాయ‌న్నారు.

ఈ కార‌ణంతోనే చంద్ర‌బాబు త‌న పేషీకి వెళ్ల‌టం లేద‌న్నారు. ఈ కార‌ణంతోనే మీడియాను అసెంబ్లీ లోప‌ల‌కు అనుమ‌తించ‌టం లేద‌న్న ఆయ‌న‌.. బాబుకు ధైర్యం ఉంటే మీడియాను.. ప్ర‌జ‌ల్ని అసెంబ్లీ లోప‌ల‌కు అనుమ‌తించాల‌న్నారు. బ‌తికి ఉన్న ఏ సీఎం కూడా త‌న పేర్ల‌తో ప‌థ‌కాలు పెట్టుకుంది లేద‌ని.. చంద్ర‌బాబు అందుకు మిన‌హాయింపుగా చెప్పారు. చంద్ర‌న్న బీమా పేరుతో త‌న పేరును పెట్టుకున్న ముఖ్య‌మంత్రి త‌ర‌హాలో మ‌రెవ‌రూ లేద‌న్నారు. న‌వ‌నిర్మాణ దీక్ష పేరుతో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇస్తున్నారంటూ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News