అమ్మ‌కు అమెరికాలోనూ గుర్తింపు ల‌భించిందిగా!

Update: 2016-12-06 12:40 GMT
సంక్షేమ ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌ - వాటి అమ‌లులో త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి - ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు అమ్మ‌గా పిలుచుకునే జె.జ‌య‌ల‌లిత‌ను మించిన వారు లేర‌న్న వాద‌న వినిపిస్తోంది. తెలుగు నాట సంక్షేమ రాజ్యానికి గ‌ట్టి పునాదులు వేసి జ‌నం మదిలో సుస్థిర‌ స్థానాన్ని సంపాదించిన స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు - ఆ త‌ర్వాత చాలా ఏళ్ల‌కు అధికారం చేప‌ట్టిన‌ దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాల‌ను మించి... త‌మిళ‌నాడులో జ‌య సంక్షేమ పాల‌న‌ను సాగించారు. అమ్మ పేరిటే ప్రారంభ‌మైన జ‌య‌ల‌లిత సంక్షేమ ప‌థ‌కాలకు దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం ల‌భించింది.

ఇక మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సంబంధించి జ‌య తీసుకున్న ఓ కీల‌క నిర్ణ‌యం ఆమెకు ఏకంగా అగ్ర‌రాజ్యం అమెరికాలోనూ గుర్తింపు తెచ్చిపెట్టింది. త‌మిళ‌నాడులో జ‌య స‌ర్కారు ప్రారంభించిన మ‌హిళా పోలీస్ స్టేషన్లు ప్ర‌పంచ దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. జ‌య తీసుకున్న ఈ కీల‌క నిర్ణ‌యానికి ఫిదా అయిన అమెరికాలోని ఇల్లినాయిస్ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎడ్గ‌ర్‌ ఏకంగా చికాగోలోని ఓ వీధికి జ‌య పేరును పెట్టారు. ఇదేదో జ‌య‌కు మాత్ర‌మే ద‌క్కిన ప్ర‌త్యేక గుర్తింపు ఎంత‌మాత్రం కాదు. ఎందుకంటే అమెరికాలోని చికాగోలో మ‌హాత్మా గాంధీ - మహ్మ‌ద్ అలీ జిన్మ‌నా - గోల్డా మీర్ పేర్ల మీద వీధులున్నాయి. చికాగో న‌గ‌రంలోని బ్రాడ్‌ వే అవెన్యూ - డెవ‌న్ అవెన్యూ -  నార్త్ షెరిడాన్ వీధులు క‌లిసే చోట ఓ వీధికి డాక్ట‌ర్ జె.జ‌య‌ల‌లిత అనే పేరు పెట్టారు. ఇలా చికాగోలోని వీధికి జ‌య పేరు పెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని కూడా ఆ దేశ పాల‌కులు ఆస‌క్తిక‌రంగా వివ‌రించారు. జ‌య నాయ‌క‌త్వానికి - అట్ట‌డుగు వ‌ర్గాల ప‌ట్ల జ‌య‌కు ఉన్న అంకిత‌భావానికి గుర్తింపుగానే ఈ వీధికి జ‌య పేరు పెట్టిన‌ట్లు ఎడ్గ‌ర్ ప్ర‌క‌టించారు.

అయితే ఇలా చికాగోలో ఓ వీధికి జ‌య పేరు పెట్ట‌డానికి కార‌ణం మాత్రం ఇల్లినాయిస్ సెనేట‌ర్ హోవ‌ర్డ్ డ‌బ్ల్యూ కెరోల్ కార‌ణ‌మ‌ట‌. త‌మిళ‌నాడులో ఏర్పాటైన మ‌హిళా పోలీస్ స్టేష‌న్లకు సంబంధించిన వివ‌రాలు తెలుసుకున్న హోవ‌ర్డ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఇల్లినాయిస్‌ లో కూడా మ‌హిళా పోలీస్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా త‌మిళ‌నాడులో జ‌య స‌ర్కారు చేపట్టిన సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా హోవ‌ర్డ్ ప్ర‌స్తావించారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో ఇల్లినాయిస్‌ లోనూ మ‌హిళా పోలీస్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా జ‌య  స‌ర్కారు మ‌హిళా సంక్షేమం కోసం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల త‌ర‌హాలో స‌రికొత్త సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News