చిద్దూకు ఎంత కష్టమో..4 కిలోల బరువు తగ్గిపోయారబ్బా!

Update: 2019-10-04 04:34 GMT
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసిన పి.చిదంబరానికి వచ్చిన కష్టం నిజంగానే మాటల్లో చెప్పలేనిది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే అరెస్టై... తీహార్ జైల్లో ఉంటున్న చిద్దూకు బెయిల్ ఇచ్చేందుకు ససేమిరా అన్న కోర్టులు... ఇంటి నుంచి ఆహరాన్ని తెప్పించుకునేందుకు కూడా నిరాకరించాయి. కోర్టులు నో అంటే చేసేదేమీ లేదు కదా. జైల్లో వండిన వంటనే ఇష్టం లేకపోయినా... ఎలాగోలా నెట్టుకొచ్చిన చిద్దూ... ఇంటి భోజనం లేకపోయేసరికి ఏకంగా 4 కిలోల బరువు తగ్గిపోయారు. ఇదే విషయాన్ని కోర్టుకు చెబితే... బెయిల్ అయితే ఇవ్వలేం గానీ... ఇంటి భోజనానికి మాత్రం అనుమతిస్తున్నామని కోర్టు తీర్పు చెప్పింది. అంటే... జైలు గోడల మధ్య అక్కడే వండిన వంటతో చిద్దూ ఏకంగా నాలుగు కిలోల బరువు తగ్గితే గానీ ఆయనకు ఇంటి భోజనానికి అనుమతి రాలేదన్న మాట.

మొన్నటి యూపీఏ హయాంలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా... కేంద్ర కేబినెట్ లో ఆర్థిక శాఖో, లేదంటే రక్షణ శాఖో, వాణిజ్య శాఖ మంత్రిగానో కూర్చునేవారు. తమిళనాట కాంగ్రెస్ పార్టీకి అంతగా మెజారిటీ గానీ, సీట్లు గానీ దక్కకున్నా గానీ... అదే రాష్ట్రానికి చెందిన చిద్దూకు మాత్రం కేంద్ర కేబినెట్ లో చోటుకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాని పరిస్థితి. ఈ లెక్కన ఓట్లు - సీట్ల లెక్కలను పక్కనపెట్టేసి మరీ చిద్దూకు మంత్రి పదవి దక్కేది. అలాంటి చిద్దూకు...  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినంతనే కష్టాలు మొదలైపోయాయి. పాత కేసులు, కొత్త కేసులన్నీ తిరగేసిన సీబీఐ... ఐఎన్ఎక్స్ కేసులో చిద్దూను అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం చిద్దూ ఎన్నిసార్లు పిటిషన్లు వేసినా... బెయిల్ ఇస్తే చిద్దూ విదేశాలకు పారిపోవడం ఖాయమంటూ సీబీఐ చేస్తున్న వాదనతో కోర్టుల్లో బెయిల్ దక్కడం లేదు. దీంతో మరింత కాలం పాటు చిద్దూ జైల్లోనే గడపక తప్పని పరిస్థితి.

పోలీసులు అరెస్ట్ చేసినంతనే జైల్లో తనకు ఇంటి భోజనానికి అనుమతించాలని చిద్దూ కోర్టును కోరారు. అయితే ఆయనపై నమోదైన కేసు తీవ్రత, చిద్దూ పిటిషన్లపై సీబీఐ చేస్తున్న వాదనలతో చిద్దూకు ఇంటి బోజనానికి కోర్టులు అనుమతించలేదు. తాజాగా చిద్దూ మరోమారు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో జైలు ఫుడ్ కారణంగా తాను ఏకంగా నాలుగు కిలోల బరువు తగ్గానని కూడా ఆయన కోర్టుకు చెప్పుకున్నారు. ఈ క్రమంలో బెయిల్ కు ససేమిరా అన్న కోర్టు... ఇంటి భోజనానికి మాత్రం చిద్దూకు అనుమతిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో రేపటి నుంచి జైల్లో ఉన్నా ఇంటి భోజనం స్వీకరించే అవకాశం ఉన్న చిద్దూ... ఈ దఫా కోల్పోయిన బరువు పెరుగుతారో? లేదంటే జైల్లో ఉన్నానన్న చింతతో మరింత బరువు తగ్గుతారో చూడాలి.

Tags:    

Similar News