హిజాబ్ వివాదం ఎందుకు? కేసీఆర్ షాకింగ్ వ్యాఖ్యలు

Update: 2022-03-15 16:30 GMT
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చిన తర్వాత ఇక ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందనుకుంటున్న సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వివాదంపై కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఒక్కొక్కరు ఒక్కో రకమైన దుస్తులు ధరిస్తారని.. ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ప్రభుత్వాలకు అభ్యంతరం ఏమిటని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ హాట్ కామెంట్స్  చేశారు. హిజాబ్ వివాదంపై స్పందించిన కేసీఆర్.. 'హైదరాబాద్ లోనూ కలహాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని' ఆరోపించారు.

దేశానికి ఐటీ క్యాపిటల్ గా బెంగళూరు  ఉందని.. ఆ నగరాన్ని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని కేసీఆర్ తెలిపారు.  బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉందన్న కేసీఆర్.. ఈ రెండు నగరాల్లో విదేశాలకు చెందిన ఎందరో తమ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి బెంగళూరులో హిజాబ్ పంచాయతీ పెట్టారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మత పిచ్చి వల్ల దేశంలో నెలకొల్పబడిన వాతావరణం, దశాబ్ధాల పాటు కొనసాగిన కృషి ఒక్కసారిగా కుప్పకూలుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశఆలు దెబ్బతింటున్నాయని.. దేశంలో దారుణమైన పరిస్థితి వస్తోందన్నారు. ప్రస్తుతం దేశం అటువంటి స్థితిలోనే ఉందని అన్నారు. దేశంలో మతన్మోదం, అల్లరి మూకదాడులు పెరుగుతున్నాయని.. దేశాన్ని నడిపే విధానం ఇదేనా? ఇవి సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

ప్రజలు తొడుక్కునే వస్త్రాలతో ప్రభుత్వాలకు ఏం పని అని కేసీఆర్ ప్రశ్నించారు. మత కలహాలు పెట్టడానికే హిజాబ్ పంచాయతీ పెట్టారని విమర్శించారు. హిజాబ్ లాంటి సమస్యలు, మతకలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి వివాదాల వల్ల దేశ యువత భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు.

బీజేపీ సంకుచిత వ్యవహారాలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. పెడధోరణి దేశానికి మంచిది కాదని.. దీనిపై దేశ, రాష్ట్ర యువత ఆలోచించాలని అన్నారు.  కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది.

హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలైన పిటీషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్ ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
Tags:    

Similar News