జగన్ కేబినెట్ లో సగం.. 22 మంది ఎమ్మెల్యేలు చీకోటి కస్టమర్లే !

Update: 2022-08-01 04:18 GMT
పదునైన వ్యాఖ్యలతో తరచూ మీడియా ముందుకు వచ్చే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మరోసారి గళం విప్పారు. తెలంగాణలో సంచలనంగా మారిన చీకోటి ప్రవీణ్ ఉదంతంలో ఏపీ అధికారపక్షానికి ఉన్న లింకుల్ని వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేపాల్ లోని క్యాసినోలకు వెళ్లిన వారిలో ఏపీ కేబినెట్ లో సగం మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. 'సగం మంది వైసీపీ మంత్రులు.. 22 మంది ఎమ్మెల్యేలు క్యాసినోలకు వెళ్లారు. అక్కడి హోటల్ మ్యాచీ క్రౌన్స్ లో బస చేశారు. కావాలంటే వారు బస చేసిన 27 గదులను తనిఖీ చేయాలి' అని డిమాండ్ చేశారు.

చీకోటి ప్రవీణ్ కు మాజీ మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వైసీపీ పెద్దలకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెప్పిన వర్ల రామయ్య మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇసుక.. మద్యం.. గనులు ఇతర మాఫియాల ద్వారా అక్రమంగా సంపాదించిన నల్లధనాన్ని క్యాసినో ముసుగులోఅధికార పార్టీ నేతలు నేపాల్ కు వెళ్లి వైట్ గా మార్చుకున్నారన్నారు.

'చీకోటి ప్రవీణ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లోనే కాదు నేపాల్.. శ్రీలంక.. థాయ్ లాండ్ లలో బిగ్ డాడీ పేరుతో క్యాసినోలు నడిపారు. అతడితో కలిసి కొడాలి నాని.. వల్లభనేని వంశీలు అనేకసార్లు నేపాల్ కు వెళ్లారు.

త్వరలోనే అధికార పార్టీకి చెందిన పెద్దల బండారాన్ని ఆధారాలతో బయటపెడతాం' అంటూ మండిపడ్డ ఆయన.. గుడివాడ క్యాసినో వల్ల కోట్లాది రూపాయిలు పోగొట్టుకొని పెద్ద ఎత్తున రోడ్డున పడ్డారన్నారు. చీకోటి ప్రవీణ్ ఉదంతం బయటకు వచ్చాక పలువురు వైసీపీ నేతల పెద్దల పిల్లలు విదేశాలకు వెళ్లిపోయారన్నారు.

ఈ సందర్భంగా వల్లభనేని వంశీ తనకు మంచి మిత్రుడిగా చెప్పిన ప్రవీణ్ వీడియోను విడుదల చేయటం గమనార్హం. మొత్తానికి వర్ల రామయ్య తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  తెలంగాణలో  షురూ అయిన ఈడీ సోదాలు చీకోటి ప్రవీణ్ భాగోతాన్ని తెర మీదకు తీసుకొస్తే.. అది కాస్తా ఏపీ రాజకీయాల్లో ప్రకంపనల్ని క్రియేట్ చేయటం గమనార్హం.
Tags:    

Similar News