చిన్నారి పై హత్యాచారం : నెల రోజుల్లోనే విచారణ పూర్తి ... కోర్టు సంచలన తీర్పు

Update: 2021-11-13 05:31 GMT
లైంగిక దాడి, హత్యాచార కేసుల్లో దోషులకు శిక్ష ఖరారు కావడానికి కోర్టుల్లో చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా మన న్యాయస్థానాల ప్రముఖ ఉద్దేశం వందమంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు. కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. అందుకే కొన్ని కేసుల్లో నెలలు పడితే మరికొన్ని కేసుల్లో ఏళ్లు గడుస్తుంటాయి. అందుకు న్యాయశాస్త్రంలో ఉన్న కొన్ని లొసుగులే కారణం. ‘ సరైన సమయానికి న్యాయం అందకపోవడం కూడా అన్యాయమే అన్నట్లు దీర్ఘకాల విచారణలు, దర్యాప్తులతో బాధిత కుటుంబాలకు సరైన న్యాయం దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి నెలరోజుల్లోనే శిక్ష విధించింది గుజరాత్‌ న్యాయస్థానం. దోషికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. గుజరాత్‌ లోని ట్రయల్‌ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. అజయ్‌ నిషద్‌ అనే వ్యక్తి.. అక్టోబర్ 12న సూరత్‌ లోని సచిన్‌ డీఐడీసీ ప్రాంతంలో తన ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారికి మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయం ఎవరికీ తెలియకూడదని ఆ బాలికను హత్యచేసి ఎవరూ లేని ప్రదేశంలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు లో నిషద్‌ దోషిగా తేలడంతో అతన్ని అక్టోబర్‌ 13న పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిపై పది రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుని ప్రత్యేక కోర్టు అక్టోబర్‌ 25న విచారణను ప్రారంభించి ఐదు రోజుల్లోనే ముగించింది. దోషికి జీవిత ఖైదుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్‌ కాలా గురువారం తీర్పునిచ్చారు. కాగా గుజరాత్‌ లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Tags:    

Similar News