ఇండియా...అమెరికాను చూసి రెచ్చిపోకు!

Update: 2017-06-28 10:10 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ శిఖ‌రాగ్ర స‌మావేశంతో చైనాలో క‌ల‌వ‌రం మొద‌లైంది. అమెరికాతో ఇండియా స‌న్నిహితంగా ఉండ‌టాన్ని చైనా జీర్ణించుకోలేక‌పోతూ వైట్‌ హౌజ్‌ లో ట్రంప్‌ - మోడీల సాన్నిహిత్యాన్ని చూసి మ‌రుస‌టి రోజు నుంచే ఇండియాను హెచ్చ‌రించ‌డం మొద‌లుపెట్టింది. అమెరికాను చూసి హ‌ద్దు దాటొద్ద‌ని, ఆ దేశం నుంచి పొందిన వ్యూహాత్మ‌క మ‌ద్ద‌తు పైపైనే అని చైనా అధికార పత్రిక గ్లోబ‌ల్ టైమ్స్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

``అమెరికా అండ చూసుకొని చైనాతో పెట్టుకోవ‌ద్దు.. చైనా స‌త్తాతో పోలిస్తే ఇండియా చాలా వెనుక‌బడి ఉంది. అమెరికా మ‌ద్దతు చూసి మురిసిపోవ‌ద్దు. అదంతా ఉత్త‌దే. చైనాతో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే స‌మ‌యం ఇది కాదు`` అని చైనా అధికార పత్రిక గ్లోబ‌ల్ టైమ్స్ భార‌త్‌ ను హెచ్చ‌రించింది. సిక్కిం ప్రాంతంలో భార‌త బ‌ల‌గాలు స‌రిహ‌ద్దు దాట‌డాన్ని ఆ ప‌త్రిక ప్ర‌స్తావించింది. ``ఇలా రెచ్చ‌గొట్ట‌డం ఇండియాకే మంచిది కాదు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఇండియా ఇలా వ్య‌వ‌హ‌రించ‌లేదు. అందుకే 2006లో నాథులా పాస్‌ ను చైనా తెరిచింది. ఇప్పుడు బ‌ల‌గాల త‌ప్పిద‌మా లేక భార‌త ప్ర‌భుత్వం కావాల‌ని చేస్తున్న‌దా తెలియ‌దుగానీ.. చైనా మాత్రం ఇలాంటివి ఉపేక్షించ‌దు`` అని గ్లోబ‌ల్ టైమ్స్ స్ప‌ష్టంచేసింది. ఇండియాతో స్నేహ‌పూర్వక సంబంధాల‌ను కొన‌సాగించాల‌నే చైనా భావిస్తోంది, అయితే ప‌రస్ప‌రం గౌర‌వించుకోవ‌డంపైనే ఆధార‌ప‌డి ఉంది అని ఆ ప‌త్రిక చెప్పింది.

కాగా, చైనా రెచ్చ‌గొట్టే క‌థ‌నంపై అంత‌ర్జాతీయ నిపుణులు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. స‌హ‌చ‌ర దేశంగా స‌ఖ్య‌త‌తో ఉండాల్సిన స‌మ‌యంలో ఇలాంటి బెదిరింపులు దౌత్య‌ప‌రంగా స‌రైన‌వి కావ‌ని పేర్కొంటున్నారు. భార‌త్ సంయ‌మ‌నాన్ని త‌క్కువ‌గా చేసి చూడటం చైనాకు త‌గిన‌ది కాద‌ని పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News