వెనక్కి తగ్గిన చైనా.. చర్చలతో ఇండియా గెలుపు

Update: 2020-06-10 12:31 GMT
శత్రువును జయించడానికి అన్నిసార్లూ యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. చర్చలతో కూడా గెలవొచ్చు. ఇండియా ఇప్పుడు ఇదే పని చేసింది. తనకంటే ఎంతో శక్తిమంతమైన చైనాను చర్చల ద్వారా నిలువరించింది. దేశమంతా కరోనాతో పోరాడుతున్న సమయాన సరిహద్దుల్లో భారత్‌ను దెబ్బ తీయడానికి ఇటు పాకిస్థాన్, అటు చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా భారీగా సైన్యాన్ని మోహరించి భారత్‌ను భయపడుతోంది. ఐతే చైనా సైన్యంతో తలపడితే ప్రయోజనం లేదని భావించిన ఇండియా.. ఆ దేశంతో చర్చలకు దిగింది. వివాదానికి దారి తీసిన లద్దాఖ్ సెక్టార్లోనే నాలుగు రోజుల కిందట చర్చలు మొదలయ్యాయి. ఇవి సానుకూల ఫలితాన్నే ఇచ్చాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

లద్దాఖ్ సరిహద్దుల్లో మోహరించిన చైనా సైన్యం వెనక్కి తగ్గింది. క్యాంపు ఏర్పాటు చేసిన మూడు ప్రదేశాల నుంచి చైనా సైనికులు రెండున్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్లారు. వీరిని కౌంటర్ చేయడానికి వెళ్లిన భారత సైనికులు కూడా కొంత మేర వెనక్కి వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగినట్లయింది. ఈ నెల 6న తూర్పు లద్ధాఖ్‌లోని చుసుల్‌ మోల్డో ప్రాంతంలో భారత్‌, చైనా సైనిక కమాండర్ల మధ్య ఐదు గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య సంప్రదింపులు జరిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించేందుకు, శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. సరిహద్దు సమస్యల పరిష్కారం విషయంలో తమ మధ్య విభేదాలు వివాదాలుగా మారకుండా చూడాలన్న ఏకాభిప్రాయానికి వచ్చాయి. త్వరలో రెండు దేశాల మధ్య బెటాలియన్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. సరిహద్దు వివాదం కాస్త సద్దుమణిగిన నేపథ్యంలో ఇండియా అంతర్గతంగా ఉన్న కరోనా ఉపద్రవంపై దృష్టిసారించే అవకాశం వచ్చింది.
Tags:    

Similar News