గ్లోబల్ టైమ్స్ లో మన గురించి ఏం రాశారు?

Update: 2020-06-17 08:10 GMT
చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్. చాలా సందర్భాల్లో తన వాదనను అధికార వర్గాల ద్వారా కాకుండా తన మీడియా సంస్థ ద్వారా వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా గాల్వన్ ఘర్షణ పైనా చైనా తన వాదనను వినిపించే ప్రయత్నం చేసింది. తన దొంగబుద్ధిని చాటుతూ.. తొండి వాదనను వినిపించింది. కుయుక్తులు వేయటంలో ఆరితేరిన డ్రాగన్.. తన తీరును మరోసారి ప్రదర్శించింది.

గాల్వన్ ఘర్షణ మొత్తం భారత్ దే బాధ్యతగా అభివర్ణించింది. తమ భూభాగంలోకి భారత సైనికులే వచ్చారని.. తమ సైనికుల మీద దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. ఫలితంగానే ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగినట్లుగా చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లూ ఝాహు పేర్కొన్నట్లు చెబుతున్నారు. గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హూ జిజిన్ రియాక్టు అవుతూ.. తనకు తెలినంతవరకు గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులూ మరణించారని చెప్పారు.

భారత్ కు తాను చెప్పేదొక్కటేనని.. దురహంకారపూరితంగా వ్యవహరించొద్దని.. భారత్ తో గొడవ పడాలని తాము అనుకోవటం లేదన్నారు. చైనా దేనికీ భయపడదన్న ఆయన మాటల్నే తీసుకుంటే.. నిజంగానే భారత సైనికులు కవ్వించాలనుకుంటే.. మన కంటే డ్రాగన్ సైనికులే భారీగా చనిపోవాలి కదా? ఇప్పటివరకున్న ట్రాక్ రికార్డును చూస్తే.. ఏ రోజు తన సరిహద్దుల వద్ద మితిమీరిన చేష్టలకు భారత్ దిగలేదన్నది మర్చిపోకూడదు.

ఇక.. భారత్ మీద ఆరోపణలు చేయటమే కాదు.. హెచ్చరించే ప్రయత్నం చేసిన గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ కు సోషల్ మీడియాలో భారీ ఎత్తున పంచ్ లు పడుతున్నాయి. చైనా దేనికీ భయపడదన్న ఆయన వ్యాఖ్యలకు పలువురు స్పందిస్తూ.. భారత్ నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొనటం గమనార్హం.

అదే పనిగా భారత్ మీద నిందలు వేసే చైనా.. సాంకేతికంగా కూడా సూపర్ అంటారు కదా? మరి.. అదే నిజమైతే.. తాజా ఘర్షణలకు సంబంధించి భారత వ్యవహారశైలిని తప్పు పట్టే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. తొండివాదనను వినిపిస్తే.. వినేందుకు భారతీయులెవరూ చెవుల్లో పువ్వులు పెట్టుకొని లేరన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News