మ‌ళ్లీ షాక్‌: చైనా తీరు మార‌లేదు గురూ!

Update: 2017-10-14 12:05 GMT
కుక్క‌తోక వంక‌ర టైపులో చైనా త‌న బుద్ధిని మాత్రం మార్చుకోవ‌డం లేదు. దేశ స‌రిహ‌ద్దుల నిత్యం ఉద్రిక్త‌త‌ల‌కు కార‌ణం అవుతూనే ఉంది. ముఖ్యంగా సిక్కిం స‌రిహ‌ద్దు ప్రాంతం డోక్లాంలో చైనా ఇటీవ‌ల కాలంలో తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు, ఆందోళ‌న‌ల‌కు తెర‌దీసింది. దాదాపు యుద్ధ‌మే వ‌స్తుందా? అనే రేంజ్‌తో ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తాయి. అయితే, ఎందుకో .. కొన్నాళ్లు చైనా వెన‌క్కి త‌గ్గింది. అయితే, తాజాగా మ‌ళ్లీ..  డోక్లాం ప్రాంతం స‌హా భూటాన్‌ తో భార‌త్‌ కు ఉన్న స‌రిహ‌ద్దుల్లో డ్రాగన్ నీడ‌లు ఆవ‌రించాయి  భారత్‌ తో తగువులాడి - ఆపై బలగాలను ఉపసంహరించుకున్న చైనా.. ఇప్పుడు భూటాన్‌-భార‌త్ స‌రిహ‌ద్దు భూభాగంలో భారీ రోడ్డును నిర్మిస్తోంది.

ఇందుకోసం సైనిక బలగాలతోపాటు భారీ యంత్రాలను అక్కడ మోహరింపజేసింది. కాగా, చైనా తీరుపై భూటాన్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్‌- చైనాల మధ్య ఆగస్టు 28న జరిగిన చర్చల్లో.. డోక్లాం నుంచి సైన్యాలను ఉపసంహరించాలనే ఒప్పందం కుదిరింది. దీంతో వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరుదేశాల సైన్యాలూ వెనక్కి జరిగాయి. భారత విదేశాంగ శాఖ సెప్టెంబర్‌ మొదటివారంలో చేసిన ప్రకటనలోనూ డోక్లాం వద్ద చైనా కార్యకలాపాలు లేవని పేర్కొంది. అయితే, భారత్‌-చైనా సైన్యాలు పరస్పరం తలపడిన ప్రాంతం నుంచి ఉత్తరదిశలో చైనా కార్యకలాపాలను ముమ్మరం చేసింది.

మొత్తం 12 కిలోమీటర్ల రోడ్డు పనులను సెప్టెంబర్‌ 27న ప్రారంభించింది. అదేరోజు సాయంత్రం ఢిల్లీలోని భూటాన్‌ రాయబారి వెట్సొప్‌ నమ్‌ గెల్‌.. చైనా రాయబారి లూ జవోహుయ్‌ ను కలిసి చర్చలు జరిపారు. సమస్య ఇంకా పరిష్కారం కానందున - మరో దఫా చర్చలు జరుపుతామని భూటాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తోన్న భారత్‌ ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి ఇది భూటాన్ స‌రిహ‌ద్దే అయినా దీనిలో భార‌త్ భూభాగం కూడా క‌లిసి ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఎన్ని ఉద్రిక్త‌త‌లు ఎదురవుతాయో చూడాలి. ఏదేమైనా చైనా బుద్ధి కుక్క‌తోక‌ను త‌ల‌పిస్తోంది.
Tags:    

Similar News