ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాదు.. అబ‌ద్ధాల ప్ర‌దేశ్: మాజీ ఎంపీ హాట్ కామెంట్స్

Update: 2022-09-20 09:58 GMT
తిరుప‌తి మాజీ ఎంపీ, ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఏకంగా ఆరుసార్లు ఎంపీగా గెలిచిన సీనియ‌ర్ రాజ‌కీయ నేత చింతా మోహ‌న్ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అబ‌ద్దాల ప్ర‌దేశ్‌గా మారిపోయింద‌న్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీని బయటి రాష్ట్రాల్లో అబద్ధాల ప్రదేశ్ అంటున్నారని గుర్తు చేశారు. అసెంబ్లీలో అన్నీ అబద్ధాలేనంటూ విమర్శించారు. రాజధాని నగరం రాష్ట్రంలో పూర్తిగా ఆగిపోయిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు కనిపిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఉపాధ్యాయులను విద్యా దీవెన పేరుతో సాక్సులు, బెల్టులు ఇవ్వడానికి పంపుతున్నారని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై చింతా మోహ‌న్ మండిపడ్డారు. ఏపీలో విద్యా ప్రమాణాలు నాశనం అయిపోయాయన్నారు. వైద్య ప్ర‌మాణాలు తీసిక‌ట్టుగా తయారయ్యాయని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి ఏపీలో నిల్ అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఆంధ్ర రాష్ట్రం అదానీ రాష్ట్రంగా మారిపోతోందని చింతా మోహ‌న్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమీ లేకుండా ఒకప్పుడు రోడ్డు మీద నిలబడ్డ అదానీ ప్రపంచ కుబేరుడు కాబోతున్నాడని తెలిపారు. దేశంలో 60 కోట్ల మంది ఆకలితో నిద్రపోతున్నారని.. రాష్ట్రంలో ఒక కోటి మంది ఆకలితో ఉంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విజయవాడలో 2 లక్షల మంది అకలితో అలమటిస్తున్నారని చెప్పారు. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఎర్ర చొక్కాలు, ఖద్దరు చొక్కాలు లేకుండా పోయాయని.. దీంతో అబద్ధాలు వినబడుతున్నాయని ధ్వ‌జ‌మెత్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది గులాంనబీ ఆజాద్ అని మండిప‌డ్డారు. ఆయన న‌రేంద్ర‌ మోడీతో వారానికి ఒకసారి కాంటాక్ట్‌లో ఉంటార‌ని ధ్వ‌జమెత్తారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ను నాశనం చేసిన ఘనత కూడా గులాంనబీ ఆజాద్ కే దక్కుతోంద‌ని నిప్పులు చెరిగాను. తాను ఇచ్చిన ఫార్ములా ఫాలో అయి ఉంటే రాజీవ్ గాంధీ బతికేవారని చింతా మోహ‌న్ ఆవేదన వ్య‌క్తం చేశారు. 1974 నుంచి చంద్రబాబు, తాను కాంగ్రెస్‌లో ఉన్నామన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఏపీలో ప్రజలు పరుగులెత్తేవారని చెప్పారు.

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజ‌య‌వంత‌మైంద‌ని చింతా మోహ‌న్ తెలిపారు. 2024లో బిజెపీకి 100 సీట్లకు మించి రావ‌ని జోస్యం చెప్పారు. బీజేపీ పాల‌న‌లో గాలి మీద త‌ప్ప అన్నిటిపైన ట్యాక్సులు ఉన్నాయ‌న్నారు. ఇప్పటివరకు బీజేపీ సాధించింది ఎనిమిది చీతాల‌ను మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. 8 చీతాల‌ను తీసుకొచ్చి గొప్పలు చెబుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

బీజేపీ కల్తీ పనులు చేస్తోందని.. 2024లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రావడం ఖాయమని చింతా మోహ‌న్ ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశారు. యూపీఏ ప్రభుత్వం రాగానే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామ‌ని తెలిపారు. దేశ సరిహద్దుల్లో చైనా వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర ఆక్రమిస్తే మోడీ ప్ర‌భుత్వం మొద్దు నిద్ర పోతోంద‌ని కేంద్రంపై మండిపడ్డారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News