మూడో ప్రయత్నంలో కటారిని హత్య చేశారా?

Update: 2015-11-24 04:14 GMT
చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్యకు సంబంధించిన కొత్త కోణం బయటకు వచ్చింది. కటారి దంపతుల్ని హత్య చేయాలన్న ఆలోచనలో ఉన్న వారి మేనల్లుడు చింటూ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడని.. హత్య చేయటానికి ముందు రెండు దఫాలు ప్రయత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. రెండు ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాక.. మూడోసారి తమ ప్రయత్నాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.  

కటారి దంపతుల హత్యకేసులో లొంగిపోయిన నిందితులు.. పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాల్ని చెబుతున్నారు. కటారి దంపతుల్ని హత్య చేసేందుకు చింటూ నేతృత్వంలో రెండుసార్లు హత్యాయత్నం చేసినా మిస్ అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. తొలిసారి మేయర్ ను హత్య చేయటానికి జులై 9న పక్కా ప్లాన్ వేసుకున్నారు. అప్పుడు కూడా కార్పొరేషన్ కార్యాలయంలోనే హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మేయర్ దంపతుల్ని చంపేందుకు వచ్చినప్పటికీ.. కటారి అనుచరుడు ఒకరు కార్పొరేషన్ కార్యాలయంలో పని చేస్తున్న కోదండన్ ను కొట్టటంతో అక్కడ రచ్చ కావటం.. మీడియా పెద్ద ఎత్తున చేరుకోవటంతో తమ ప్లాన్ ను అమలు చేయకుండా ఊరుకున్నారు.

దీపావళి రోజున కటారి దంపతుల్ని హత్య చేయటం ద్వారా.. వారి కుటుంబాన్ని శోకంలో నింపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్  కార్యాలయాన్నే హత్యకు వేదికగా చేసుకున్నారు. అయితే.. ఆ రోజు ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చినప్పటికీ.. కార్పొరేషన్ ఉద్యోగి మురళి అనే వ్యక్తి మరణించి.. దానికి సంబంధించిన నియామకం కింద ఉద్యోగాన్ని తనకు ఇవ్వకుండా మరొకరికి కట్టబెట్టాలన్న ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లుగా ఆరోపిస్తూ మురళీ సతీమణి ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో మీడియా పెద్ద ఎత్తున రావటంతో హత్య ప్లాన్ ను వాయిదా వేసుకున్నారు.

ఈ రెండు దఫాలకు ముందు గతంలోనే వేర్వేరు సందర్భాల్లో హత్యకు ప్లాన్ చేసినా పలు అవాంతరాలతో ఆగినట్లుగా తెలుస్తోంది. అయితే.. బయట హత్య చేసే కన్నా.. కార్పొరేషన్ కార్యాలయంలోనే హత్యను పూర్తి చేయాలన్న ఆలోచన వచ్చాక తొలి రెండు దఫాలు వాయిదా వేసుకున్న నిందితులు.. మూడోసారి తాము అనుకున్నట్లే కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతుల్ని హత్య చేసి పారిపోయినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News