నాటి పులివెందుల డీఎస్పీ సీన్లోకి వచ్చేశారు

Update: 2022-02-23 07:38 GMT
ఒక క్రైం థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్ తో పాటు..వైఎస్ వివేకా హత్య కేసును తవ్వే కొద్దీ బయటకు వస్తున్న షాకింగ్ అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. వివేకా హత్య కేసులో మిగిలిన పాత్రలు ఒక రీతిలో ఉంటే.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర కాసింత అనుమానస్పదంగా.. రోటీన్ కు భిన్నంగా ఉండటం కనిపిస్తుంది. ఆ మధ్యన ఈ కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేయటమే కాదు.. వివేకా కుమార్తె.. అల్లుడు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు.. వెల్లడించిన వివరాలు మిగిలిన వారికి భిన్నంగా ఉండటం తెలిసిందే.

అంతేకాదు.. ఈమధ్యనే సీబీఐ అధికారులు తనను హింసిస్తున్నారని.. వివేకా హత్య కేసులో విచారణ కోసం తనను ఏకంగా 22 సార్లు విచారణకు పిలిచినట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ ఇవ్వటం తెలిసిందే. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా తాను చెప్పకుంటే తన కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తానని వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటమే శరణ్యమన్న ఆయన.. తమది గౌరవంగా బతికే సామాన్య కుటుంబంగా చెప్పుకున్నారు.

సీబీఐ విచారణ పేరుతో గత ఏడాదిగా తనను వేధిస్తున్నారని.. ఆయన హత్య గురించి అందరికీ తెలిసినట్లుగానే తనకూ తెలిసిందని.. అయినప్పటికీ విచారణ కోసం 22 సార్లు పిలిచినట్లుగా పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన రోజు తాను ఎక్కడకు వెళ్లలేదని.. తాను చేయని పనిని చేసినట్లుగా చెప్పలేనన్నారు. ఇంతకీ ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరన్నది చూస్తే పులివెందులలోని యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి. ఇక.. ఇతగాడి గురించి హత్య జరిగిన సమయంలో పులివెందుల డీఎస్పీగా వ్యవహరించిన వాసుదేవన్ సీబీఐకు వాంగ్మూలాన్ని ఇచ్చారు.

2019 మార్చి 15న వైఎస్ వివేకా హత్య జరిగిన వైనాన్ని వెల్లడిస్తూ.. ఆ రోజు ఉదయం ఉదయ్ కుమార్ రెడ్డి వివేకా ఇంటి సమీపంలో తిరిగినట్లుగా తాము గుర్తించామన్నారు. వివేకా డెడ్ బాడీకి కట్లు.. బ్యాండేజీలు వేసింది ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రేనని స్పష్టం చేశారు. వివేకా హత్య జరిగిన ఉదయం 4.38 నుంచి 4.48 మధ్య ఒక వ్యక్తి పులివెందులలోని బ్రిడ్జిస్టోన్ టైర్ల దుకాణం సమీపంలో టూ వీలర్ మీద పదే  పదే తిరుగుతున్న వైనాన్ని సీసీ కెమేరాలు రికార్డు చేశాయని.. ఆ ఫుటేజ్ లో ఈ వివరాలు కనిపిస్తాయని ఆయన చెబుతున్నారు.  

నాటి పులివెందుల సీఐ శంకరయ్య వాంగ్మూలంలో పేర్కొన్న వివరాల్లో కొన్ని నాటి డీఎస్పీ వాసుదేవన్ వాంగ్మూలంలోనూ సరిపోలినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News