#HyderabadPub : పుడింగ్ మింక్ పబ్ లో డ్రగ్స్ వ్యవహారం!

Update: 2022-04-03 10:30 GMT
హైదరాబాద్ లోని పబ్ లో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ రేవ్ పార్టీ కేసులో ఏకంగా 157మంది పట్టుబడడం.. అందులో సినీ, రాజకీయ ప్రముఖులు ఉండడం.. సెలబ్రెటీల పిల్లలు కూడా ఇందులో పట్టుబడడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇటువైపే నెలకొంది. హైదరాబాద్ లో రేవ్ పార్టీలు మరియు డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి కాదు.. మత్తుపదార్థాలు విచ్చలవిడిగా వాడకం ఎప్పుడో బయటపడింది. చాలా సార్లు రేవ్ పార్టీలు, డ్రగ్స్ పట్టుబడడాలు జరిగాయి. టాలీవుడ్ ప్రముఖులు కూడా విచారణ ఎదుర్కొన్నారు.అయితే తాజాగా రేవ్ పార్టీలో చాలా మంది ప్రముఖులు పెద్ద ఎత్తున పట్టుబడడం సంచలనమైంది.

హైదరాబాద్ లో డ్రగ్స్ పెడ్లర్లు, డీలర్ల ద్వారా మాఫియా నడుస్తోందని తెలుసు. కానీ ఫస్ట్ టైమ్, ఓ పబ్ లో రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్  దొరికాయని అంటున్నారు.  అదే ఈ ‘పుడింగ్ మింక్ పబ్’. ఈ పబ్ లో డ్రగ్స్ వాడినట్టు అనుమానిస్తున్నారు.  బాత్ రూంలో డ్రగ్స్ వాడినట్టు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు.   పబ్ లోకి ఈ డ్రగ్స్ ఎలా వచ్చాయన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.  పబ్ నిర్వాహకులే సప్లై చేశారా? లేక పెడ్లర్ ఎవరైనా వచ్చి ఈ డ్రగ్స్ సరఫరా చేశారా? అన్నది విచారణలో తేలనుంది.

-ఈ పబ్ ఎవరిది? ఎవరు నిర్వహిస్తున్నారు?

గతంలో ఓ మాజీ ఎంపీ కూతురి పేరు మీద ఈ పబ్ ఉండేది. ప్రస్తుతం దీని నిర్వహణ అంతా ఉప్పాల అభిషేక్ అనే వ్యక్తి చేతుల్లోనే ఉంది. సెంచ్యూరీ హోటల్స్ నిర్వహణ కూడా ఈ అభిషేక్ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం పోలీసుల అదుపులో అభిషేక్ తోపాటు పబ్ సిబ్బంది కూడా ఉన్నారు. అసలు లేట్ నైట్ పార్టీలో ఏం జరిగింది? ఎంత డ్రగ్స్ వాడారు? వాటిని ఎవరు సప్లై చేశారన్నది విచారిస్తున్నారు.

-పబ్ లో ఎవరెవరు దొరికారు?

నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రగ్స్ తీసుకున్న అనుమానితులు మాత్రమే  ఉన్నారు. మిగతా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించినట్టు తెలిసింది.  పట్టుబడిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక,రాహుల్ సిప్లిగంజ్ సహా ప్రముఖులు ఉన్నారు. వీరికి నోటీసులు అందించి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించారు.

-ఎంపీ గల్లా ఫ్యామిలీ క్లారిటీ..

ఈ  రేవ్ పార్టీ కేసులో టీడీపీ ఎంపీ కుమారుడు,  టాలీవుడ్ యంగ్ హీరో గల్లా అశోక్ కూడా ఉన్నట్టుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీంతో ఈ వివాదంపై గల్లా ఫ్యామిలీ స్పందించింది. పబ్ వివాదంతో గల్లా అశోక్ కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.  ఈ మేరకు ఒక మీడియా నోట్ ను గల్లా కుటుంబం విడుదల చేసింది.‘‘నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో  గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.’’ అని గల్లా కుటుంబం ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

-కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ వివరణ

ఈ డ్రగ్స్ కేసులో తన కుమారుడు ఉన్నారన్న వార్తలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. పబ్ లో ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకే తన కుమారుడు వెళ్లాడని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్ లో పబ్ కల్చర్ పై కాంగ్రెస్ పార్టీ తరుఫున పోరాటాలు చేస్తామని అంజన్ ప్రకటించారు.

-సీఐ సస్పెన్షన్.. ఏసీపీకి మెమో

పబ్ కేసులో నిర్లక్ష్యంగా వహించిన  బంజారాహిల్స్ సీఐని సస్పెండ్ చేశారు. అలాగే ఏసీపీకి చార్జ్ మెమో దాఖలు చేశారు. గతంలో స్థానికుల నుంచి పబ్ విషయంలో  ఫిర్యాదులు వచ్చినా బంజారాహిల్స్ పోలీసుల చర్యలు తీసుకోలేదని భావించింది. దీంతో బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సీపీ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. మరోవైపు ఏసీపీ సుదర్శన్ కు కూడా చార్జి మెమో ఇచ్చారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏసీపీనీ సీపీ ఆదేశించారు.

హైదరాబాద్‌ నగరంలో ఇప్పుడు మెట్రో పాలిటిన్ సిటీ. ఇక్కడే చాలా మంది సినీ, రాజకీయ, పారిశ్రామిక సెలబ్రెటీలు నివసిస్తున్నారు. హైదరాబాద్ శివారుల్లోనూ చిన్నచితకా, బహుళజాతి ఐటి, ఐటి ఆధారిత సాంకేతిక సేవల కంపెనీలు సుమారు 1,183 ఉన్నట్లు తాజా అంచనా. వీటిలో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తున్నారు. వారం చివరలో జరిగే విందులూ వినోదాల్లో ఈ బడాబాబులు అంతా పాల్గొని మద్యం సేవించడం, పబ్బుల్లో చిందేయడం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ కల్చర్‌లో చాలా కాలంగా సాగుతోంది. పబ్బుల్లో కొంత మంది డ్రగ్స్‌ వినియోగిస్తున్నారు. తరచుగా పోలీసులు, టాస్క్‌ ఫోర్స్‌ జరుపుతున్న దాడుల్లో డ్రగ్స్‌ సేవించిన వారు పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా డ్రగ్స్ కేసులో చాలా మంది సినీ ప్రముఖులు పట్టుబడడం కలకలం రేపింది. తెలంగాణ సర్కార్ మరోసారి డ్రగ్స్ ను ఉక్కుపాదం అణిచివేయాలని యోచిస్తోంది. ఇక బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఉన్న ఈ పబ్ పై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం సీరియస్ అయ్యినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సీరియస్ యాక్షన్ దిశగా తెలంగాణ సర్కార్ సమాయత్తమవుతున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News