టీడీపీ-కాంగ్రెస్ సీట్ల పంప‌కంపై రేపు క్లారిటీ

Update: 2019-01-02 06:15 GMT
ద‌శాబ్దాల వైరాన్ని ప‌క్క‌న‌పెట్టి చేతులు క‌లిపిన కాంగ్రెస్ - టీడీపీ తెలంగాణ‌లో ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశాయి. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ రెండు పార్టీల పోత్తు పై  కొన్నాళ్లుగా నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. తెలంగాణ‌లో ప‌రాభ‌వం నేప‌థ్యంలో ఏపీలో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ - టీడీపీ ఆస‌క్తి చూప‌బోవ‌ని చాలామంది భావించారు. ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపించారు.

అయితే - ఆ విశ్లేష‌ణ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులైన‌ట్లే. ఏపీలో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు ఖాయ‌మైంది. కేవ‌లం సీట్ల పంప‌కం మాత్ర‌మే మిగిలి ఉంది. స్వ‌యంగా ఏపీ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ర‌ఘువీరా రెడ్డి ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. సీట్ల పంప‌కం పై క్లారిటీ కోసం గురువారం టీడీపీ - కాంగ్రెస్ స‌మావేశ‌మ‌వ్వ‌బోతున్న‌ట్లు తెలిపారు. త‌మ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీతోపాటు తాను కూడా ఆ భేటీలో పాల్గొన‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు.

వాస్త‌వానికి తెలంగాణ ఎన్నిక‌ల కంటే ముందే ఏపీలో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు కుదుర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో టీడీపీకి కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తే.. ఏపీలో అంత‌కు రెట్టింపు సీట్ల‌ను కాంగ్రెస్ కు టీడీపీ కేటాయించాల‌ని ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ లెక్క‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ కు టీడీపీ 24 సీట్లు ఇవ్వాల్సి వ‌స్తుంది. రాహుల్ అధ్య‌క్ష‌త‌న రేపు జ‌రిగే స‌మావేశంలో ఈ సీట్ల సంఖ్య‌పై పూర్తి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉండ‌టం - తెలంగాణ‌లోనే ఆ పార్టీ దారుణ ప‌రాజ‌యం పాల‌వ్వ‌డం వంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్ కు 24 సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు సుముఖ‌త  చూప‌కపోవ‌చ్చున‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే - ముందే కుదుర్చుకున్న ఒప్పందం కాబ‌ట్టి ఆయ‌న‌కు వేరే దారి లేద‌ని, ఇప్పుడు పొత్తు కుద‌ర‌ద‌ని కాంగ్రెస్ చెయ్యి విడిస్తే కేంద్రంలో ఒంట‌రిగా మారే అవ‌కాశ‌ముంద‌ని మ‌రికొంద‌రు సూచిస్తున్నారు. ఒప్పుకున్న పెళ్లికి వాయించ‌క త‌ప్పుతుందా అన్న చందాన కాంగ్రెస్ కు చంద్ర‌బాబు సీట్లు ఇచ్చి తీరుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News