కొట్టేసుకున్న టీఆర్ ఎస్‌.. మ‌జ్లిస్ నేత‌లు

Update: 2017-07-06 04:45 GMT
మిత్ర‌ప‌క్షం కాన‌ప్ప‌టికీ తెలంగాణ అధికార‌ప‌క్షానికి మిత్ర‌ప‌క్షమ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది మ‌జ్లిస్ పార్టీ. మిగిలిన పార్టీల విష‌యంలో క‌ర‌కుగా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మ‌జ్లిస్ విష‌యంలో చూసీచూడ‌న‌ట్లుగా ఉంటారు. ఇందుకు త‌గ్గ‌ట్లే మ‌జ్లిస్ సైతం టీఆర్ ఎస్ మీద తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయ‌టం క‌నిపించ‌దు. ఇలా ఇరు పార్టీల మ‌ధ్య స్నేహ‌భావం వెల్లివిరిస్తోంది.

మ‌రి.. ఇలాంటి అన‌ధికార మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య ఉన్న అనుబంధం ఆ పార్టీ నేత‌ల మ‌ధ్య కూడా ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. తాజాగా ఇదే విష‌యం బ‌య‌ప‌డింది కూడా. రంజాన్ సంద‌ర్భంగా చేసిన ఏర్పాట్లు తామే చేసామంటూ మ‌జ్లిస్‌.. టీఆర్ ఎస్ నేత‌లు ఇద్ద‌రూ పోటాపోటీగా సోష‌ల్ మీడియాలో చేసుకున్న పోస్టుల ప్ర‌చారం.. చివ‌ర‌కూ ఆ ఇద్ద‌రు నేత‌లు బూతులు తిట్టుకొని.. కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. సంగారెడ్డి మున్సిప‌ల్ స‌మావేశంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇరు నేత‌ల మ‌ధ్య కొద్దిపాటి ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసింది.

సంగారెడ్డి మున్సిప‌ల్ స‌మావేశం తాజాగా జ‌రిగింది. దీనికి మ‌జ్లిస్ పార్టీకి చెందిన కౌన్సిల‌ర్ హారీఫ్ హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశానికి టీఆర్ ఎస్ నేత ష‌మీ స‌తీమ‌ణి కూడా హాజ‌ర‌య్యారు. కౌన్సిల‌ర్ అయిన భార్య‌ను స‌మావేశానికి దింపేందుకు ష‌మీ వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా రంజాన్ ఏర్పాట్లు తామే చేసుకున్నామంటూ ఇరువురు నేత‌ల మ‌ధ్య వాగ్వాదం మొద‌లైంది. చివ‌ర‌కు బూతులు తిట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. మాట‌ల యుద్ధం కాస్తా చేత‌ల్లోకి వెళ్లిపోయి.. కుర్చీల‌తో కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. అలానే వ‌దిలేస్తే విష‌యం మ‌రింత ముదిరిపోతుంద‌ని గుర్తించిన నేత‌లు.. వారిద్ద‌రిని విడ‌దీసి బ‌య‌ట‌కు పంపారు. మిగిలిన కౌన్సిల‌ర్ల జోక్యం విష‌యం తాత్కాలికంగా స‌ద్దుమ‌ణిగింది.


Tags:    

Similar News