క్లీన్ బౌల్డయిన టీమ్ ఇండియా

Update: 2021-11-08 05:48 GMT
లీగ్ మ్యాచ్ లో ఇంకా చివరిది మిగిలుండగానే టీమ్ ఇండియా క్లీన్ బౌల్డయిపోయింది. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్ధాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆదివారం న్యూజిల్యాండ్ గెలిచిందో అప్పుడే టీమ్ ఇండియా సెమీ ఫైనల్స్ కు తలుపులు మూసుకుపోయాయి. సోమవారం నమీబియాతో చివరి లీగ్ మ్యాచ్ ఇండియా ఆడటం కేవలం లాంఛనం మాత్రమే. ఏదన్నా భారీ స్కోరు చేయటమో లేకపోతే ఎవరైనా ఆటగాడు అత్యధిక స్కోరు చేయటం అదీకాకపోతే బౌలర్లలో ఎవరైనా రెచ్చిపోయి అత్యధిక వికెట్లు తీసుకోవటమే చేసి రికార్డు సృష్టించేందుకు మాత్రమే ఈరోజు మ్యాచ్ ఉపయోగపడుతుంది.

క్రికెట్ లో ఏదన్నా జరగచ్చన్న నానుడి నిజమే అయితే నమీబియాతో జరిగే మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. గెలవాల్సిన మొదటి రెండు మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా ఓడిపోవటమే మన కొంపముంచింది. నిజానికి టోర్నమెంటు మొదలుకాకముందు అన్నీ జట్లలోకి భారతే ఫేవరేట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా తీసుకుంటే ఎవరికి వారుగా వందలాది పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ఉన్నారు. అలాగే ప్రత్యర్ధులను అదరగొట్టే బౌలర్లు కూడా ఉన్నారు.

కానీ విచిత్రం ఏమింటటే అందరినీ కలిపి ఒక జట్టుగా ఆడమంటే ప్రత్యర్ధుల ముందు చేతెలెత్తేశారు. కచ్చితంగా గెలవాల్సిన రెండు మ్యాచుల్లోను ఓడిపోవటమే భారత్ ను దెబ్బతీసింది. ఇదే సమయంలో ఏమాత్రం నిలకడలేని పాకిస్ధాన్ జట్టు మంచి విజయాలను సొంతం చేసుకుంటోంది. పాకిస్ధాన్ టీమ్ నుండి ఇలాంటి అత్యుత్తమ ఆటను పాకిస్ధాన్ క్రికెట్ బోర్డుతో పాటు అభిమానులు ఏమాత్రం ఊహించలేదు.

భారీ అంచనాలతో టోర్నమెంటులో అడుగుపెట్టిన భారత జట్టు బొక్కబోల్తా పడితే ఏమాత్రం అంచనాలు లేని పాకిస్ధాన్ అదరగొడుతోంది. లీగ్ దశలో దర్జాగా గెలిచి సెమీస్ లోకి అడుగుపెట్టాల్సింది పోయి మనజట్టు పేలవమైన ఆట కారణంగానే ఇతర జట్ల ఓటమికి ఎదురు చూడాల్సొచ్చింది. పాకిస్ధాన్ జట్టు ఒక్క మ్యాచ్ లో అయినా ఓడకపోతుందా అని ఒకసారి, చివరకు న్యూజిల్యాండ్ జట్టుపై ఆఫ్ఘన్ జట్టు విజయం సాధించాలని యావత్ దేశం కోరుకున్నదంటే మనం ఎంతటి నిరాసలో ఉన్నామో అర్ధమైపోతోంది.

అభిమానులు ఒకటి కోరుకుంటే జరిగింది మరొకటి. పాకిస్ధాన్ ఎక్కడా ఓగిపోలేదు, న్యూజిల్యాండ్ పై ఆఫ్ఘన్ కూడా గెలవలేదు. దాంతో ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సుండగానే టోర్నమెంటులో భారత్ జట్టు క్లీన్ బౌల్డయిపోయింది. ఇంతటి పేలమైన ఆటతీరును ఈమధ్య మన జట్టు ప్రదర్శించలేదన్నది నిజమే. సరే ఆటలన్నాక గెలుపోటములు చాలా సహజమే. కానీ ఓటమిలో కూడా కాస్త గౌరవంగా ఓడిపోతే అభిమానులు కూడా బాధపడరు. ఎందుకంటే క్రికెట్ అంటే మిగిలిన ప్రపంచానికి కేవలం ఒక ఆట మాత్రమే. కానీ మనదేశంలో అదో మతం, భావోద్వేగాల సమ్మేళనం.




Tags:    

Similar News