రూ.2వేల నోటు పని అప్పుడు మొదలైందట

Update: 2017-01-11 04:53 GMT
రూ.2 వేల నోటుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఉన్నట్లుండి మార్కెట్ లోకి తెచ్చినట్లు కనిపించిన రూ.2వేల నోటును తీసుకురావటం వెనుకున్న భారీ కసరత్తు అధికారిక సమాచారం ద్వారా బయటకు వచ్చింది. నోట్లు రద్దు నిర్ణయం తర్వాత రూ.2వేల నోటు బయటకు రావటం.. అందుకు తగిన విధంగా ఏటీఎంలు తయారు చేయటానికి టైం సరిపోలేదన్న వాదనలు వినిపించాయి. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని.. రూ.2వేల నోట్ల తయారీకి.. దాని రంగు.. రూపం.. సైజు విషయాల్ని నెలల కిందటే నిర్ణయం తీసుకున్నారన్న సరికొత్త విషయం బయటకు వచ్చింది.

వ్యూహాత్మకంగా వ్యవహరించిన కారణంగానే.. ఏటీఎంలలో మార్పులు చోటు చేసుకోలేదే తప్పించి.. హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఎంత మాత్రం కాదన్న విషయాన్ని తెలిపే అంశాలు వెల్లడి అయ్యాయి.

దేశానికి రూ.5వేలు.. రూ.10వేల నోట్లను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని మోడీ సర్కారు కొలువు తీరిన కొద్ది కాలానికే ఆర్ బీఐ సూచన చేసింది. 2014 అక్టోబరు 7న ఇందుకు సంబంధించిన కీలక సూచనను కేంద్రానికి ఆర్ బీఐ చేసింది. నాటి ద్రవ్యోల్బణ పరిస్థితులు.. చెల్లింపులు సులభతరం చేయటంతోపాటు.. సమర్థవంతమైన కరెన్సీ సరఫరా నిర్వహణ కోసం ఆసూచనలు చేసినా.. మోడీ సర్కారు సానుకూలంగా స్పందించలేదు.

అయితే.. ఆర్ బీఐ సూచనలకు భిన్నంగా 2016 మే 18న రూ.2వేల నోటును తీసుకొచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 2016, మే 27న కొత్త నమూనా.. సైజు..రంగు.. థీమ్ తో కొత్త సిరీస్ కరెన్సీ విడుదల చేయాలంటూ ఆర్ బీఐ సిఫార్సు చేయటం.. అందులో రూ.2వేలనోటు ఉండటం గమనార్హం. ఆర్ బీఐ సిఫార్సులపై కేంద్రం కేవలం పది రోజుల (సుమారు) వ్యవధిలోనే ఓకే చెప్పేయటం.. అదే నెల నుంచి ప్రింటింగ్ ప్రారంభించాలని ప్రెస్సులకు వెల్లడించటం గమనార్హం. ఈ అధికారిక సమాచారమంతా ఆర్ బీఐనే వీరప్ప మొయిలీ అధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఇదంతా చూసినప్పుడు.. నోట్ల రద్దు నిర్ణయానికి ముందు భారీ కసరత్తు జరగటంతో పాటు.. లాభనష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహనతోనే మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లుగా అర్థమైనట్లు చెప్పక తప్పదు. ఇక.. ఏటీఎం కష్టాలు.. జనాలు బారులు తీరటం అన్ని కూడా మోడీ రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరిగాయే తప్పించి.. అందుకు భిన్నంగా ఎంతమాత్రం కాదన్న విషయం తాజా నివేదిక స్పష్టం చేసిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News