ప్రజల ఛాయిస్ ప్రకారమే సీఎం అభ్యర్ధి

Update: 2022-01-14 05:33 GMT
పంజాబ్ లో అధికారంలోకి రావడం ఖాయమని అనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆప్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందో చెప్పే అవకాశం ప్రజలకే ఇస్తున్నట్లు ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం రాష్ట్రంలోని 3 కోట్లమంది ప్రజలకు ఇస్తున్నట్లు అరవింద్ చెప్పారు.

సీఎంగా ఎవరు ఉండాలనే నిర్ణయం నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల అభిప్రాయాలకే వదిలేయాలని తమ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ సూచన మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.  ముఖ్యమంత్రిగా  ఎవరు ఉండాలనే  విషయమై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు 70748 70748 అనే మొబైల్ నెంబర్ ను కూడా ప్రకటించారు. ఈ నెంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా కానీ లేదా వాట్పస్ ద్వారా కానీ అభిప్రాయాలు చెప్పచ్చన్నారు.

పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చాలా మీడియా, సర్వే  సంస్ధలు ప్రీపోల్ సర్వేలు నిర్వహించాయి. అన్నింటిలోను ఆప్ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. కొన్ని సంస్ధలేమో ఆప్ కంఫర్టబుల్ మెజారిటితో అధికారంలోకి వస్తుందని చెప్పాయి. మరికొన్నేమో సింగిల్ లార్జెస్టు పార్టీగా నిలుస్తుందని తేల్చాయి. ఏదేమైనా అధికారంలోకి వచ్చేది మాత్రం ఆప్ అనే తేలిపోయింది. అందుకనే కేజ్రీవాల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

అరవింద్ తాజా  నిర్ణయం వినూత్నమనే చెప్పాలి. ఎలాగంటే ప్రజాభిప్రాయం ప్రకారం ముఖ్యమంత్రిని ఎంపిక చేయటం బహుశా దేశంలో ఇదే మొదటిసారేమో. పార్టీలకు అధికారం అందించడం కోసమే జనాలు ఓట్లేస్తారు. అంతేకానీ పలానా నేత తమకు ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయాలు చెప్పటం మన దగ్గర  ఉండదు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎంఎల్ఏలే ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎన్నుకుంటాయి. కానీ ఇఫుడు కేజ్రీవాల్ కొత్త పద్దతిని ప్రవేశపెట్టారు. మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా ? ఏమో చూడాల్సిందే.
Tags:    

Similar News