వివాదాలు లేని ప్లాట్ల తక్కువ ధరకే.. జగన్ బంపర్ ఆఫర్

Update: 2022-01-11 14:30 GMT
వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని జగన్ అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇల్లుండాలని అన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. మొదటి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై పనులు జరుగుతాయన్నారు.

మధ్యతరగతి సొంతింటి కలను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. దీనిలో భాగంగానే ప్రభుత్వం ఎంఐజీ లేఅవుట్లు వేస్తోందని జగన్ అన్నారు. ఎంఐజీల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందించేలా ఇవాళ్టి నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. మూడు కేటగిరిల్లో స్థలాలు పంపిణీ చేస్తామని.. ఎంఐజీ1లో 150 గజాలు, ఎంఐజీ2లో 200 గజాలు, ఎంఐజీ3 కింద 240 గజాలు అందిస్తామని సీఎం వివరించారు.

తొలి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లే అవుట్లలో అమలు చేస్తామన్నారు. నేటి నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు.

రాబోయే రోజుల్లో ప్రతీ నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్తరిస్తామని.. ఆయా ప్రాంతాల ప్రజలు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని జగన్ వివరించారు.

రూ.18 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం తెలిపారు. ఏడాదిలో నాలుగు విడతల్లో ప్లాట్ కోసం డబ్బు చెల్లించే అవకాశముంటుందన్నారు. దరఖాస్తు సమయంలో 10శాతం, నెలలోపు 30శాతం, ఆరు నెలల్లోపు 30శాతం, రిజిస్ట్రేషన్ లోపు మిగిలిన 30 శాతం చెల్లించవచ్చన్నారు. చెల్లింపులు పూర్తయిన వెంటనే అభివృద్ధి చేసిన ప్లాటును లబ్ధిదారుడికి అందజేస్తామన్నారు.
Tags:    

Similar News