అంతర్వేది లో కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్!

Update: 2021-02-19 09:00 GMT
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయంలో కొత్తగా తయారుచేసిన రథాన్ని ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ హెలిప్యాడ్ ‌కు చేరుకున్న సీఎం... అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు.  సీఎం వైఎస్ జగన్ ‌కు  వేదపండితులు ఆశీర్వచనం అందించారు. స్వామి వారిని దర్శించుకున్న సీఎం.. అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన  ప్రారంభించారు.

ఆ తర్వాత రథం గురించి విశేషాలను సీఎం జగన్ అడిగి తెలుసుకొన్నారు. రథం విశిష్టతలను సీఎం జగన్ కు ఆలయ అధికారులు తెలియజేశారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు.

గతేడాది సెప్టెంబర్‌ 5న అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఈ అంశంపై వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించారు. కొత్త రథంతోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు.  ఆ మాట ప్రకారం రధోత్సవం సమయానికి కొత్త రథాన్ని ప్రారంభించారు. కొత్త రథానికి స్టీరింగ్ తో పాటు బ్రేకులను కూడ అమర్చారు. అంతేకాదు రథానికి ఇనుపగేటును కూడ అమర్చారు. గతంలో చోటుచేసుకొన్న అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రథం నిర్మాణం చాలా జాగ్రత్తలు పాటించింది.
Tags:    

Similar News