మీడియాను ఆడుకోవ‌డం అంటే ఏంటో మ‌ళ్లీ చూపించిన కేసీఆర్‌

Update: 2022-02-06 00:30 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యం గురించి, ఆయ‌న ఎత్తులు - పై ఎత్తుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మిగ‌తా నాయ‌కులు ఎవ‌రూ టార్గెట్ చేయ‌ని రంగాల‌ను త‌న‌దైన శైలిలో టార్గెట్ చేసేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి ఇష్ట‌ప‌డ‌తార‌ని చెప్తుంటారు. ఇందులో ప్ర‌జాస్వామ్యంలో నాలుగో స్తంభ‌మ‌నే పేరున్న‌ మీడియా కూడా ఒక‌టి. దీనికి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇలాంటి ఎపిసోడ్ స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని అంటున్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ దీర్ఘ‌కాలం త‌ర్వాత తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన సంగ‌తి తెలిసిందే. శంషాబాద్ ముచ్చింత‌ల్‌లో నిర్వ‌హిస్తున్న ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం, ఇక్రిసాట్‌లో నిర్వ‌హిస్తున్న వ్య‌వ‌సాయ‌ సంబంధిత కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్లో పాల్గొన్నారు. అయితే, ప్ర‌ధాన‌మంత్రి తెలంగాణ రాక నేప‌థ్యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం మ‌రియు వీడ్కోలు నేప‌థ్యంలో తెలంగాణ సీఎం వైఖ‌రి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ధాన‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో స్వాగ‌తం - వీడ్కోలు ప‌ల‌క‌డం అనేది ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హ‌జంగా నిర్వ‌హించే విధాన‌ప‌రమైన ప్ర‌క్రియ. అయితే, ఈ ప్రొటొకాల్ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన‌డం గురించి మీడియా ఉక్కిరిబిక్కిరి చేసేలా స‌మాచారం విడుద‌ల అయింది. ప్ర‌ధాని టూర్‌కు ఒక‌రోజు ముందు ఆయ‌న‌కు స్వాగ‌తం వీడ్కోలు ప‌లికే కార్య‌క్ర‌మంలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ పాల్గొంటార‌ని అధికారిక వ‌ర్గాల నుంచి `అధికారిక‌` స‌మాచారం విడుద‌ల అయింది. ఈ వార్తను మీడియా ప్ర‌చారం చేసింది. ఈ స‌మాచారం వైర‌ల్ అయింది, చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే, ప్ర‌ధాని వ‌చ్చే రోజు ఉద‌యం మ‌రో `అప్ డేట్` వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ప్ర‌ధానమంత్రి ఆహ్వానం మ‌రియు వీడ్కోలు ప‌లికే కార్య‌క్రమంలో పాల్గొంటార‌ని `అన‌ధికార` స‌మాచారం వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి ప్రొటోకాల్ ప్ర‌కారం పాల్గొంటునున్నార‌ని మ‌ళ్లీ మీడియా ప్రచారం చేసింది. అయితే, మ‌రికొద్దిసేప‌టికి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్వ‌ల్పంగా జ్వ‌రంగా ఉన్నందున ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి టూర్లో ఆహ్వానం వీడ్కోలు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌ట్లేద‌ని వెల్ల‌డి అయింది. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ ఈ మేర‌కు మీడియా అప్‌డేట్  ఇచ్చింది.

కాగా, ఆయా మీడియా సంస్థ‌ల సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో ఈ మేర‌కు స‌మాచారం పోస్ట్ అవ‌గా వాటిపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌ధానమంత్రి ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌డంలో ముఖ్యమంత్రి పాల్గొన‌డం గురించి ఇంత అస్ప‌ష్ట స‌మాచారం ఉంటుందా? స‌రైన స‌మాచారం అంటే ఇన్ని మార్పులతో కూడిన‌దా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News