మిడ‌త‌ల భ‌ర‌తం ప‌డ‌దాం: అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

Update: 2020-06-10 16:44 GMT
మ‌రోసారి మిడతల దండు రాష్ట్రంపైకి దండెత్త‌నుంద‌ని స‌మాచారం వ‌స్తుండ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అప్రమ‌త‌మ‌య్యారు. మరోసారి దండు రాబోతుంద‌ని వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ క్ర‌మంలో సంబంధిత అధికారుల‌కు మార్గ‌నిర్దేశం చేశారు. మిడతలు రాకుండా జాగ్రత్తలు, వ‌చ్చిన త‌ర్వాత వాటిని త‌రిమేసే ప్ర‌క్రియ‌ను వివ‌రించారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైన సమయంలో మిడతల దండు దాడి చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. లేత పంటను మిడతలు పీల్చి పారేస్తాయని, ఈ నేప‌థ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మిడతల దండు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపారు. సరిహద్దుల్లో ఉన్న 8 జిల్లాలు (భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి) జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 20 నుంచి జూలై 5వ తేదీ వరకు మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. మిడతల దండు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తీసుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్యంలో ప్రత్యేక బృందాన్ని సీఎం కేసీఆర్ ఏర్పాటుచేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ద‌న్ రెడ్డి, వ్యవసాయ విశ్వ‌విద్యాల‌య వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎంసీ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆర్. సునీత, వ్యవసాయ విశ్వ‌విద్యాల‌య సీనియర్ శాస్త్రవేత్త రహమాన్ తదితరులతో కూడిన బృందం ఒకటీ రెండు రోజుల్లో ఆదిలాబాద్‌లో పర్యటించనుంది. అక్కడే ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించ‌నున్నారు. మిడతల దండు గమనాన్ని పరిశీలిస్తూ, అవసరమైన చర్యలను పర్యవేక్షిస్తుంది.

Tags:    

Similar News