ఏం మాయ చేస్తావు కేసీఆర్.. ఇంతలా అట్రాక్టు చేసేస్తున్నావ్?

Update: 2020-05-07 04:08 GMT
పావు గంటకు తక్కువ రెండు గంటలు. ఇంచుమించు ఒక హాలీవుడ్ సినిమా సమయం. అంతసేపు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. గుడ్లు అప్పగించి.. టీవీ వంక తదేకంగా చూడటం సాధ్యమవుతుందా? రాజకీయ నాయకుడు ఎవరైనా సరే.. అదే పనిగా పావుగంట మాట్లాడితే చాలు.. చేతిలో ఉన్న రిమోట్ కు పని మొదలవుతుంది. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే చాలు.. అదో ఉత్కంఠ. ఆయన మాట్లాడున్నంత సేపు కన్ను ఆర్పకుండా చూడటం.. ఆయన చెప్పే మాటల్ని జాగ్రత్తగా వినటం.. ఆయన మాటలకు కన్వీన్స్ కావటం లాంటివి మామూలే.

తాజాగా.. అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత.. ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. దగ్గర దగ్గర 105 నిమిషాలకు పైనే మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్ని ప్రస్తావించారు. కరోనా వేళ.. తరచూ ప్రెస్ మీట్లు పెట్టే ఆయన.. తాజాగా మాత్రం కాస్త లేటుగా పెట్టారని చెప్పాలి. కరోనా కాలంలో అందునా లాక్ డౌన్ వేళ.. ఉదయం నుంచి రాత్రి వరకూ అదే పనిగా టీవీలు చూస్తున్న వారు.. ఇప్పుడు ఛానళ్లను వదిలేసి.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ను వీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం తపిస్తున్న ప్రజలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం లైవ్ లో వస్తుందంటే.. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ చాలామంది ఆసక్తిగా వీక్షించటం ఈ మధ్యన చోటు చేసుకున్న కొత్త పరిణామం. లాక్ డౌన్ వేళ.. ఇళ్లల్లోనే ఉంటున్న ప్రజలు కరోనా అప్డేట్స్ కోసం కేసీఆర్ ఏం చెబుతున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన లైవ్ ను మిస్ కాకుండా చూసే ధోరణి పెరిగిందట.

సాధారణంగా రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత వివిధ చానల్స్ లో సెకండ్ షో లో భాగంగా సినిమాలు ప్రదర్శిస్తుంటారు. కేసీఆర్ ప్రెస్ మీట్ ను మిస్ కాకూడదన్న ఉద్దేశంతో.. తెలుగు ప్రజలంతా న్యూస్ ఛానళ్లను వీక్షించినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి క్రెడిట్ గతంలో మరే ముఖ్యమంత్రికి దక్కలేదంటున్నారు.
Tags:    

Similar News