కేసీఆర్‌ కు కోపం వ‌స్తే స‌మ్మె నోటీస్ సీన్ కాస్తా..!

Update: 2018-05-18 04:56 GMT
ముద్దు ముద్దుగా అడ‌గాలి. అయ్యా.. కాస్త మా బాధ‌ను అర్థం చేసుకోండ‌య్యా అని విన్న‌వించుకోవాలి. మీరు కాకుంటే మ‌మ్మ‌ల్ని ఆదుకునే వారే లేరే అంటూ గోడును వెళ్ల‌బోసుకోవాలి. మీ జ‌మానా స్టార్ట్ అయ్యాకే మా బ‌తుకులు బాగ‌య్యాయ‌ని ప్రార్థించాలి. అంతేకానీ.. మా జీతాలు పెంచ‌కుంటే స‌మ్మె చేస్తాం.. ఇదిగో నోటీస్ అంటూ అంద‌రు ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర చేసిన‌ట్లు చేస్తే కేసీఆర్‌కు కోపం రాదు. కాస్త మా సంగ‌తి చూడండి.. జీతాలు పెంచండి సార్‌.. మీకు పుణ్యం ఉంటుంద‌ని అడిగిన వెంట‌నే.. గ‌త ప్ర‌భుత్వాల మాదిరి బేరాల్లోకి వెళ్ల‌కుండా.. మీరు పాతిక ప‌ర్సంట్ పెంచ‌మంటే.. నేను 27 ప‌ర్సంట్  పెంచేస్తున్నా.. అంటూ స్వీట్ షాకిచ్చే ర‌కం కేసీఆర్‌.

మ‌రి.. అలాంటి ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర జీతాలు పెంచుతారా?  లేదా?  అంటూ స‌మ్మె నోటీసు ఇస్తానంటే కేసీఆర్ లాంటి అధినేత‌కు కాలిపోదు?  తాజా ఉదంతంలో ఇలానే జ‌రిగింది.  ఆర్టీసీ కార్మిక సంఘాల మ‌ధ్య‌నున్న పంచాయితీ నేప‌థ్యంలో.. సంఘాల మ‌ధ్య‌నున్న పోటీ పుణ్య‌మా అని.. త‌మ రాజ‌కీయ మైలేజీ పెంచుకోవ‌టం కోసం సంఘ నేత‌లు ఎప్ప‌టి మాదిరి స‌మ్మె నోటీసులు ఇచ్చాయి.  

వారు అనుకున్న‌ది వేరు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న వేళ‌.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అడిగిందే త‌డువుగా అంద‌రిని ఏదోలా సంతృప్తి ప‌రుస్తున్న కేసీఆర్ ను.. త‌మ స‌మ్మె నోటీసుతో అటు కార్మికుల్లోనూ.. ఇటు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర త‌మ ప‌ర‌ప‌తి పెంచుకోవాల‌న్న ప్లాన్ వేశాయి ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం. ఒక సంఘం స‌మ్మె నోటీసు ఇచ్చినంత‌నే.. మిగిలిన‌ సంఘాలు అదే బాట ప‌ట్టాయి. త‌మ నోటీసుల‌తో కేసీఆర్ స‌ర్కారు మెత్త‌బ‌డి జీతాలు పెంచేస్తే ఆ క్రెడిట్ త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని సంఘాలు భావించాయి.

జీతాల పెంపుతో వ‌చ్చే క్రెడిట్ వ‌స్తే.. గిస్తే త‌న అకౌంట్లోకి రావాలే కానీ.. వేరే వారి ఖాతాలోకి వెళుతుందంటే.. కేసీఆర్ లాంటి సీఎంకు కోపం రాకుండా ఉంటుందా? అది కాక‌..  మిగిలిన ముఖ్య‌మంత్రుల మాదిరే త‌న‌ను ఒకే  గాటున క‌క‌ట్టేయ‌టం కూడా కోపం వ‌చ్చి ఉండొచ్చు. మిగిలిన వారి మాదిరి కాక‌.. తాను ఇ స్పెష‌ల్ అన్న విష‌యాన్ని ఆర్టీసీ కార్మిక‌ సంఘాలు మ‌ర్చిపోవ‌టంతో ముఖ్య‌మంత్రికి మంట పుట్టించింద‌ని అంటున్నారు.

అందుకే.. వారంద‌రికి టోకుగా షాకిచ్చార‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను అడ‌గాల్సిన రీతిలో అడిగితే  జీతాల పెంపుపై ఆయ‌న సానుకూలంగా స్పందించేవార‌ని చెప్పాలి. ఎందుకంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ‌కు సంబంధించి సానుకూలంగా స్పందించేందుకు సీఎం సిద్ధంగా ఉన్న వేళ‌.. ఆ ప్ర‌క‌ట‌న‌తో పాటు ఆర్మీసీ ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణపైనా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. ఉద్యోగుల జీతాల పెంపుతో వారిని హ్యాపీగా ఉంచాల‌న్న భావ‌న కేసీఆర్ లో మొద‌టి నుంచి ఉంది. అందుకే.. వారు అడిగిన దాని కంటే ఎక్కువ జీతాలు పెంచారే కానీ త‌గ్గించ‌లేదు. క‌డుపు నిండుగా పేరుతో.. ఉద్యోగుల్ని సంతృప్తికి గురి చేస్తున్న కేసీఆర్ ద‌గ్గ‌ర తెలివిని ప్ర‌ద‌ర్శించిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు షాక్ త‌గిలింది. త‌న‌తోనే ఆట‌లా?  అన్న ఆగ్ర‌హం కేసీఆర్ మాట‌ల్లో క‌నిపించింది.

ఆర్టీసీ న‌ష్టాల గురించి ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. స‌మ్మె అంటూ బెదిరింపులు చేస్తారా?   జీతాలు పెంచం.. ఏం చేస్తారో చేసుకోండంటూ కేసీఆర్ తేల్చి పారేయ‌టంతో సీఎం ఆగ్ర‌హం ఎంత‌న్న విష‌యం కార్మిక సంఘాల నేత‌ల‌కు అర్థ‌మైంది. కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర త‌మ కార్మిక సంఘాల నేత‌లు తోక జాడించిన విష‌యాన్ని ఆర్టీసీ కార్మికులు అర్థం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. చ‌క్క‌గా జీతాలు పెంచే అవ‌కాశాన్ని త‌మ నేత‌లు చేజేతులారా నాశ‌నం చేశార‌న్న మండిపాటు  ఆర్టీసీ ఉద్యోగుల్లో మొద‌లైంది.  తాము వేసిన ప్లాన్ మొద‌టికే మోసం రావ‌టంతో ఆర్టీసీ కార్మిక సంఘాల‌కు విష‌యం అర్థ‌మైంది. కేసీఆర్ ను డీల్ చేయ‌టంలో తాము చేసిన ఘోర త‌ప్పిదాన్ని గుర్తించి.. దాన్ని స‌రిదిద్దుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఇందులో భాగంగా.. తాము చేస్తామ‌న్న స‌మ్మె గురించి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. నోటీసు ఇచ్చినంత మాత్రాన స‌మ్మెకు దిగిన‌ట్లు కాద‌ని.. ఇది బెదిరింపో.. బ్లాక్ మొయిలింగో కాద‌ని మంత్రివ‌ర్గ ఉప సంఘానికి విన్న‌వించుకొని.. సారు కోపం చ‌ల్లారే మార్గం చెప్పండి మ‌హా ప్ర‌భూ అంటూ లోగుట్టుగా వేడుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

స‌మ్మె నోటీసును ఆన‌వాయితీగా ఇచ్చామే తెప్పించి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు కోపం తెప్పించాల‌న్నది త‌మ ఉద్దేశం కాదంటూ వివ‌ర‌ణల మీద వివ‌ర‌ణ‌లు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ఎపిసోడ్ అంతా చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే. కేసీఆర్ అంటే కేసీఆరే. ముఖ్య‌మంత్రి అంటే ఇట్లుండాల‌న్న‌ట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. సీఎం స్థానంలో ఉన్న త‌న‌ను అర్థించాలే కానీ.. డిమాండ్ చేయ‌టం ఏమిట‌న్న సందేశంతో పాటు.. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం త‌న‌ను వాడుకోవ‌ట‌మా?  అన్న ఆగ్ర‌హం అంద‌రికి అర్థ‌మైంది. తాను ఆడించాలే కానీ.. త‌న‌ను ఆడించే వారిని కేసీఆర్ స‌హించ‌గ‌ల‌రా?  అందుకే.. ఇప్పుడు ఆర్టీసీ సంఘ నేత‌ల‌కు త‌త్త్వం బోధ ప‌డింది. ఇప్పుడు వారంతా కేసీఆర్ ను ఎలా ప్ర‌స‌న్నం చేసుకోవాల‌న్న అంశంపైన మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న వారిని ఆట ఆడించే ఉద్యోగ సంఘాల్ని ఎలా కంట్రోల్ చేయాల‌న్న విష‌యం మీద మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్ ద‌గ్గ‌ర పాఠాలు నేర్చుకుంటే మంచిదేమో?


Tags:    

Similar News