పోచంపాడ్ సాక్షిగా కేసీఆర్ తాట తీసే కార్య‌క్ర‌మం

Update: 2017-08-10 04:34 GMT
ఏదైనా అంశంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక‌సారి ఫిక్స్ అయితే చాలు దాని సంగ‌తి చూసే వ‌ర‌కూ నిద్ర ప‌ట్ట‌ని వైనం ఆయ‌న‌లో క‌నిపిస్తుంది. అధికారంలో వ‌చ్చిన నాటి నుంచి ఇరిగేష‌న్ ప్రాజెక్టుల రీ డిజైనింగ్ మీదా రీ ఇంజ‌నీరింగ్ మీదా దృష్టి పెట్ట‌టం తెలిసిందే.

ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యంపై తెలంగాణ విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకిస్తున్నాయి. ప‌లు ప్రాజెక్ట‌ల డిజైన్ల‌ను త‌మ‌కు త‌గ్గట్లుగా మార్చుకుంటూ.. జేబులు నింపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ గులాబీ బాస్ మీద ఆరోప‌ణ‌ల్ని చేస్తున్నాయి విప‌క్షాలు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ మీద న్యాయ‌స్థానాల్లో కోర్టు వేస్తూ కేసీఆర్ అండ్ కోకు చికాకు తెప్పించ‌ట‌మే కాదు.. అడుగు ముందుకు ప‌డ‌కుండా అడ్డుకుంటున్న ప‌రిస్థితి.

న్యాయ‌స్థానంలో విప‌క్షాలు చేస్తున్న పోరాటానికి ధీటుగా ప్ర‌జాక్షేత్రంలో పోరాటం ద్వారా విప‌క్షాల మీద పైచేయి సాధించాల‌న్న‌ట్లుగా ఉంది కేసీఆర్ తీరు చూస్తుంటే. తెలంగాణ రాష్ట్ర రూపురేఖ‌లు మార్చేందుకు వీలుగా.. రాష్ట్రంలోని వ్య‌వ‌సాయ‌దారుల‌కు భారీ ఎత్తున ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకు ఇరిగేష‌న్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేస్తూ ముందుకెళుతుంటే.. ఆ మైలేజీ రాకుండా ఉండేందుకు విప‌క్షాలు కుట్ర ప‌న్నుతున్నాయంటూ మండిప‌డుతున్నారు కేసీఆర్‌.

ఈ మ‌ధ్య‌నే సుదీర్ఘ మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్ర‌స్థాయిలో క‌డిగేసిన కేసీఆర్.. ఆ స‌మ‌యంలో కోర్టుల్లో కేసులు వేయిస్తున్న వైనంపై విరుచుకుప‌డ్డారు. ఒక‌ద‌శ‌లో నా కొడుకులు అంటూ ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన ఆగ్ర‌హం అంద‌రిలో విస్మ‌యాన్ని క‌లిగించింది.

ఇదిలా ఉంటే.. తాజాగా నిజామాబాద్ జిల్లా పోచంపాడు ద‌గ్గ‌ర శ్రీరాంసాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద ఎస్సార్ ఎస్సీ పున‌ర్జీవ ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంత‌రం ఈ మ‌ధ్యాహ్నం ఆయ‌న భారీ బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. ఈ స‌భ ద్వారా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌ను అనుకున్న రీతిలో పూర్తి కానివ్వ‌కుండా విప‌క్షాలు అడ్డుకుంటున్నాయ‌ని.. వారికి బుద్ధి చెప్పాల‌న్న పిలుపును కేసీఆర్ ఇవ్వ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. మాటల మాంత్రికుడైన కేసీఆర్ మాట‌ల ప్ర‌భావం ఈ స‌భ‌లో ఓ రేంజ్లో ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ స‌భ సాక్షిగా ప్ర‌తిప‌క్షాల తాట తీసే కార్య‌క్ర‌మాన్ని కేసీఆర్ చేప‌డ‌తార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.   

Tags:    

Similar News